Monday, June 21, 2021

Modi false promises

 అసత్యమేవ జయతే’నా...అంతేనా?!

------------ భాస్కరం కల్లూరి

                ---

“వ్యాక్సిన్ ‘అందరికీ’ ఉచితంగా ఇవ్వడానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉంది”

 

---అని ప్రధాని అన్నట్టు టీవీ తెరమీద హఠాత్తుగా స్క్రోలవుతూ కనిపించింది. ఆశ్చర్యపోయాను. నేనే పొరపాటు చూశానేమోననుకుని ఇంకోసారి స్క్రోల్ అయ్యేవరకూ ఆగి మళ్ళీ చూశాను: సందేహంలేదు, అలాగే ఉంది. మరిన్ని వివరాలు దొరుకుతాయేమోనని ఇతర న్యూస్ చానెల్స్ కూడా గాలించాను, కానీ దొరకలేదు.

 

దాంతో ఆన్ లైన్ న్యూస్ పేపర్స్ లో వెతికాను. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఆ వార్త కనిపించింది. లక్షమంది కోవిద్ వారియర్స్ కు మరిన్ని నైపుణ్యాలను పెంచడానికి ఉద్దేశించిన కోర్సును, ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తూ ప్రధాని ఈ మాట అన్నారు. 


‘Central govt committed to providing free Covid-19 vaccines to everyone: PM Modi’ అని ఆ వార్తకు ఉంచిన శీర్షిక.


                                                    *  

నిజమా?! “వ్యాక్సిన్ ‘అందరికీ’ ఉచితంగా ఇవ్వడానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి” ఉందా?!


మే 1వ తేదీనుంచి 18-44 ఏళ్లవారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనీ, కోవిన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని చెప్పడంతో మా అబ్బాయి మే 1 వచ్చీరాగానే పేరు రిజిస్టర్ చేసుకోడానికి ప్రయత్నించాడు, కానీ రిజిస్టర్ కాలేదు. రెండు, మూడురోజులు అలా ప్రయత్నించిన తర్వాత, వ్యాక్సిన్ అందుబాటులో లేదు కనుక పేర్లు రిజిస్టర్ చేసుకోవడంలేదని తెలిసి ఊరుకున్నాడు. ఆ తర్వాత చాలారోజులకు, “స్లాట్ దొరుకుతోంది, బుక్ చేసుకోవచ్చు”నంటే మళ్ళీ ల్యాప్ టాప్ ముందు కూర్చున్నాడు. వరసగా అయిదురోజులపాటు, రోజులో ఎన్నోసార్లు, ఎంతోసేపు అలాగే కూర్చున్నాడు. అయిదో రోజున ఎట్టకేలకు స్లాట్ దొరికింది; విజయగర్వంతో ఒక్క కేక పెట్టాడు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు టైమిచ్చారు. వెళ్ళి 1200/- చెల్లించి కోవ్యాక్సిన్ వేయించుకుని వచ్చాడు. 


అలాగే మా మేనల్లుడు, మేనగోడలు కూడా అన్ని రోజులూ, అంత సమయమూ వెచ్చించి చివరికి స్లాట్ సంపాదించి, డబ్బు చెల్లించి వ్యాక్సిన్ వేయించుకున్నారు. చాలా ఇళ్ళల్లో చాలామంది ఇలాగే చేసి ఉంటారు. 


బెంగళూరునుంచి ఇంకో విషయం తెలిసింది: ఒక పెద్ద ఆసుపత్రిగ్రూపువారు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఫ్లాట్స్ దగ్గరికి వాళ్ళే వచ్చి వ్యాక్సిన్ వేస్తామని చెప్పారట. కాకపోతే, మామూలుగా చెల్లించే మొత్తం కన్నా ఎక్కువ చెల్లించాలట. అందుకు ఒప్పుకుని కొన్ని వందలమంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 


ముంబైలో జరిగిన ఇలాంటి ఘటన ఒకటి వార్తలకెక్కింది. ఒక పెద్ద ఆసుపత్రి గ్రూపు పేరు చెప్పి కొంతమంది ఇలాగే ఒక అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ వారిని సంప్రదించారు. వారు చెప్పిన రేట్లకు ఒప్పుకుని అయిదువందలమంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. తీరా చూస్తే, వ్యాక్సిన్ పేరుతో వారికి ఇంజెక్ట్ చేసింది సెలైన్ వాటరని తెలిసింది. 


బెంగళూరులో కూడా ఇలాగే జరిగిందేమో తెలియదు. దేశం మొత్తం మీద ఇలాంటి మోసాలు ఇంకెన్ని జరిగి ఉంటాయో?! అన్నీ వార్తలకు ఎక్కవు. 


వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా ఇస్తామని గత ఏడాదినుంచీ కేంద్రం చెబుతోంది. టీకాలు ఉచితంగా వేయించుకోడానికే మనం అలవాటుపడ్డాం. అందుకని వ్యాక్సిన్ కు 1200/- చెల్లించడమంటే నాకు మొదటినుంచీ గొంతులో గరళం అడ్డుపడ్డట్టే ఉంది. మనసు చివుక్కుమంటూనే ఉంది. ఇక్కడ సమస్య, డబ్బు కాదు. అవసరమైనప్పుడు తల తాకట్టు పెట్టైనా వైద్యానికి వేలూ, లక్షలూ ఖర్చు పెడతాం. ప్రభుత్వమే అడిగితే, 1200/- కాదు, 2000/- అయినా ఇస్తాం. కానీ ఈ వ్యాక్సిన్ వేరు, ఒకానొక క్లిష్టసమయంలో ప్రభుత్వానికీ-పౌరుడికీ మధ్య ఉన్న ఒక సున్నితమైన బంధానికి దానిని ప్రతీకగా నేను ఊహించుకున్నాను. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికీ-పౌరుడికీ ఉండాల్సిన సంబంధం, కార్పొరేట్-కస్టమర్ సంబంధం కాదు. 


ప్రాణమిచ్చినందుకూ, అన్నం పెట్టినందుకూ అమ్మకు డబ్బివ్వం, అమ్మ అడగదు; అమ్మ కడుపు చూస్తుంది కానీ, జేబు చూడదు. అయినా అమ్మకోసం ఎంతైనా ఖర్చు పెడతాం, ఏమైనా చేస్తాం.  ప్రభుత్వానికీ, పౌరుడికీ మధ్య ఉండాల్సింది అలాంటి బంధం కాదా!


ప్రభుత్వం బాధ్యతను గాలికొదిలేస్తే చివరికి ఎలాంటివి చూడాల్సి వస్తోంది? జనం వందలు చెల్లించి వ్యాక్సిన్ పేరుతో నీళ్ళ చుక్కలు కొనుక్కొని మోసపోవాల్సి వస్తోంది.


కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సిన్ పాలసీని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత, 18-44 ఏళ్ల వారిని కూడా కేంద్రం ‘ఉచితం’ పరిధిలోకి తెచ్చింది తప్ప ‘అందరికీ’ ఉచితమయ్యే విధంగా నిర్ణయం తీసుకోలేదు. అంతకుముందు 50 శాతం వ్యాక్సిన్ ను వేర్వేరు రేట్లకు అమ్ముకోడానికి ఉత్పత్తిదారులకు ఇచ్చిన అనుమతిని ఇప్పుడు పాతికశాతానికి తగ్గించింది, అంతే. 

  

                                                   *

ఇప్పటికే ఎంతోమంది వ్యాక్సిన్ ను కొనుక్కున్న చేదునిజం వెక్కిరిస్తున్న పరిస్థితిలో--

“వ్యాక్సిన్ ను ‘అందరికీ’ ఉచితంగా ఇవ్వడానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉం” దని  ప్రధాని సత్యదూరమైన మాటలు మాట్లాడడం ఎలాంటిది?! ఒంటిమీద కత్తితో గాటు పెట్టి దానిమీద కారం రాయడం లాంటిది కాదా?! ఇంత పెద్ద అసత్యం ప్రధాని నోట ఎలా దొర్లింది?! 

 

“మీ వంతు వచ్చేవరకూ ఆగితే వ్యాక్సిన్ మీకు ఉచితంగానే లభిస్తుంది. అంతవరకూ ఆగకుండా తొందరపడి డబ్బు చెల్లించి మీరు వ్యాక్సిన్ తీసుకుంటే అది మీ తప్పు అవుతుంది కానీ, ప్రభుత్వం తప్పెలా అవుతుం”దనే కుయుక్తితో, కుతర్కంతో ప్రధాని మాటను ఎవరూ సమర్థించబోరనే అనుకుంటున్నాను. వ్యాక్సిన్ కు రకరకాల రేట్లు నిర్ణయించి, ప్రకటించింది ప్రభుత్వమే కనుక జనం వ్యాక్సిన్ కొనుక్కోవడంలో తన బాధ్యత లేదని అనలేదు. ఎలా చూసినా ‘అందరికీ’ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్రం కట్టుబడి ఉందనడం నూటికి నూరుపాళ్లు అసత్యం!


                                                     *   

ఇదొక పెద్ద అసత్యమా, దీనినింత పీకిపాకాన పెట్టాలా అని అభిమానులు వెనకేసుకురావచ్చు కానీ, జనానికి తెలియకుండా ఇంకా పెద్దవైన అసత్యాలు ఎన్నెన్ని దొర్లుతున్నాయోనన్న అనుమానం కలగదా?! చిన్న అసత్యం ఆడేవారు పెద్ద అసత్యాలు ఆడడానికి వెనకాడతారని ఎలా అనుకుంటాం?! అంతిమంగా ఇంత పెద్ద స్వతంత్రప్రజాస్వామికభారతరాజ్యం అసత్యాలు, అర్థసత్యాలనే చచ్చుపుచ్చు పునాదుల మీద నిలబడి ఉందనీ; ఎప్పటికైనా ఒరిగిపోతుందనీ అనిపించదా?! భవిష్యత్తును తలచుకుని భయం వేయదా?!


హరిశ్చంద్రుడు అబద్ధమాడి ఉంటే రాజ్యం దక్కేది. సత్యం కోసం రాజ్యాన్ని పోగొట్టుకుని వారణాసిలో కాటికాపరిగా కుదురుకున్నాడు. సమున్నతభారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి, వేదపురాణ ఇతిహాసవాఙ్మయప్రాభవం గురించి, అవి చెప్పే విలువల గురించి పగలూ, రాత్రీ మాట్లాడే పార్టీకీ, పరివార్ కీ చెంది; వారణాసికి జనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న మోడీజీ- హరిశ్చంద్రుడి ఆదర్శాన్ని ఏ గంగపాలు చేశారు?! ఏ రాజ్యం కోసం అబద్ధాన్ని ఆశ్రయించారు?!


రాముడు జాబాలి బోధ విని, తండ్రికిచ్చిన మాటను గట్టున పెట్టి, వనవాసం విరమించుకుని, అయోధ్యకు తిరిగివెడితే ఆయనకూ రాజ్యం దక్కేది. కానీ సత్యంకోసం రాజ్యాన్ని వదలుకున్నాడు. సత్యం ఎంత గొప్పదో జాబాలికే బోధించాడు. “రాజధర్మం సత్యస్వరూపం. లోకమంతా సత్యం మీదే ఆధార పడి ఉంది. రాజు సత్యసంధుడైతే ప్రజలు కూడా ఆయననే అనుసరిస్తారు. పామును చూసి భయపడినట్లు జనం అసత్యవాదిని చూసి భయపడతారు. తండ్రి మాటను సత్యం చేస్తానని సత్యప్రమాణం చేసినవాడిని, దానిని ఎలా జవదాటను?” అని ప్రశ్నిస్తాడు. ‘జై శ్రీరామ్’ నినాదంతో అధికారశిఖరాగ్రానికి చేరిన పార్టీకి చెంది, అయోధ్యలో దివ్యభవ్యరామాలయానికి నిన్న గాక మొన్న భూమిపూజ చేసిన మోడీజీ రాముని ఆదర్శాన్ని ఏ అధఃపాతాళానికి తొక్కి ఏ రాజ్యభోగం కోసం అసత్యానికి పాల్పడ్డారు?! 


‘అశ్వత్థామా హతః”(అశ్వత్థామ చనిపోయాడు) అని బిగ్గరగా అని, ‘కుంజరః’(ఏనుగు) అని మెల్లగా అన్న ధర్మరాజు ఆ అబద్ధం ద్వారా కురుక్షేత్రయుద్ధ విజయానికీ, రాజ్యాధికారానికీ మరింత దగ్గరయ్యాడు. మోడీజీ రామనీతిని పక్కనపెట్టి తన అసత్యం ద్వారా ఏ రాజ్యలోభం కోసం ధర్మరాజనీతిని తలకెత్తుకున్నారు?!


వామనుడు కోరినట్టు మూడడుగులు ఇవ్వబోయి వినాశాన్ని కొని తెచ్చుకోబోతున్న బలిచక్రవర్తితో, ఎప్పుడెప్పుడు అబద్ధమాడవచ్చో, రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు బోధించాడు. ప్రాణానికీ, ధనానికీ, మానానికీ భంగం కలిగే సందర్భాలు కూడా వాటిలో ఉన్నాయి. కానీ ‘రాక్షస’రాజైన బలిచక్రవర్తి కూడా శుక్రనీతిని పక్కన పెట్టి మాట మీద నిలబడి సర్వం కోల్పోయాడు.  మరి ఏ ధనమానాలను రక్షించుకోవడానికి మోడీజీ ఇంత అసత్యమాడారు?!  


స్వతంత్రభారతగణతంత్రరాజ్యం “సత్యమేవ జయతే… అనగా సత్యం మాత్రమే ఎల్లవేళలా జయిస్తుం”దన్న సూక్తిని జాతీయ ఆదర్శంగా స్వీకరించి, తన జాతీయచిహ్నంలో నిబంధించుకుంటే; ఆ సూక్తిని తలకిందులు చేస్తూ “అసత్యమేవ జయతే” అని మోడీజీ ఎలా నిరూపించదలచుకున్నారు?! 


                                                    *

పాలకులు దుష్యంతునివంటి వారు. తమ రాజ్యధనాన్ని, మానాన్ని రక్షించుకోడానికి ఎలాగైనా బొంకుతారు. సత్యధర్మాలను ఎన్ని నిలువుల లోతునైనా పాతిపెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ బాధితులు, పీడితులు, దుర్బలులైన  జనం శకుంతలవంటివారు. వారికి సత్యధర్మాలనేవి కేవలం ఆదర్శాలు కావు, అవసరాలు. ఏ బలమూ లేనివారికి అవే ఆత్మరక్షణ కవచాలు. అందుకే శకుంతల సత్యం ఎంత గొప్పదో అనేక ఉదాహరణలతో ఉగ్గడించి తనకు న్యాయం చేయమని అడుగుతుంది.

 

ప్రజలకు ప్రధానసేవకుడినని చెప్పుకుంటూ అధికారం స్వీకరించినవారిని అబద్ధాల దుష్యంతుడు ఆవహించడమంటే-జనాన్ని ఆదుకోవలసిన సత్యధర్మాలూ, న్యాయమూ పూర్తిగా ప్రమాదంలో పడినట్టుకాదా?!

No comments:

Post a Comment