జయహో మోడీ నుంచి అంతా మోళీ...వరకు
April 26 , 2021 | UPDATED 08:13 IST
జయహో మోడీ నుంచి అంతా మోళీ...వరకు
స్వతంత్ర భారత్ కు ఇప్పటి వరకు చాలా మంది ప్రధానులు వచ్చారు. వెళ్లారు. ప్రజల మీద నేరుగా ముద్రవేసిన ప్రధానులు తక్కువ మంది. నెహ్రూ పాలన గురించి చెప్పగలిగేవారు తక్కువ. పుస్తకాలు తిరగేయాల్సిందే. పైగా ఆయన నేరుగా ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకున్నది తక్కువ అనే చెప్పాలి. ఇందిరాగాంధీ మాత్రం నేరుగా ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి జనాలకు గుర్తు వున్నారు.
బ్యాంకుల జాతీయకరణ, భూ సంస్కరణలు వంటివి జనాలను నేరుగా ప్రభావితం చేసాయి. అదే సమయంలో కొన్ని పరిశ్రమల ఏర్పాటు ఆమె పేరు గుర్తుండేలా చేసాయి. కానీ అలాంటి ఇందిర కూడా తరువాత తరువాత కేవలం అధికారం నిలబెట్టుకోవడం, రాజకీయాలు చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఆ తరువాత నాన్ కాంగ్రెస్ ప్రధానులు ఎవరు వచ్చినా నేరుగా ప్రజల మీద పెద్దగా ప్రభావం కనబర్చలేకపోయారనే చెప్పాలి.
మళ్లీ పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, టైమ్ లో తీసుకున్నసంస్కరణలు నేరుగా ప్రజల మీద ప్రభావం చూపించాయి. ఆ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు ప్రజలను నేరుగా ప్రభావితం చేసే ప్రధానిగా మోడీ కనిపిస్తున్నారు. ఆరేడేళ్లుగా మోడీ పేరు జనాల్లో పూర్తిగా మమేకం అయిపోయింది. అంతకు ముందు గుజరాత్ కు మాత్రమే మోడీ పరిమితం అయిపోయినా, రాజకీయాల్లో ఆయన ప్రభావం ఆయన పేరు వినిపిస్తూ వుండేది. కానీ ఇప్పుడు మోడీ అన్నది ఇంటింటికి సుపరిచితం అయిపోయింది.
శ్రీశ్రీ చెప్పిన కవిత మాదిరిగా వుంది మోడీ వ్యవహారం ఇప్పుడు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసిన మోడీ పేరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోతోంది. అయితే మోడీ కావచ్చు, భాజపా కావచ్చు అదృష్టం ఒక్కటే. సరైన జాతీయ స్థాయి నాయకుడు కానీ ప్రతిపక్షం కానీ లేకపోవడం. కాంగ్రెస్ ను వృద్ధాప్యం ఆవరిచింది. యంగ్ జనాలు ఆ పార్టీని నమ్మడం లేదు. యంగ్ జనాలు పెద్దగా ఆ పార్టీలో మిగలలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ కు వీరాభిమానులుగా వున్న తరం దాదాపు అంతరించిపోతోంది. యువతరం కొత్త భావనలతో భాజపాను లేదా స్థానిక ప్రాంతీయ పార్టీలతోనూ మిగిలిపోయింది.
ఇది ముమ్మాటికీ భాజపాకు కలిసి వచ్చింది. భాజపా మినహా మరే జాతీయ పార్టీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫ్రభావితం చేయగలిగిన పార్టీ మరొకటి ప్రస్తుతానికి దేశంలో లేదు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఎంత గొంతు చించుకున్నా, ఎంత పోరాటం సాగించినా, ముందుకు వెళ్లాల్సింది రాష్ట్రాల్లో మిగిలిన సీనియర్లతోనే తప్ప, ఆ పార్టీకి కొత్త రిక్రూటీలు లేరు. రారు కూడా.
మార్కెటింగ్ మోడీ...చాలా తెలివిగా, మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేసి, జనాల్లో గుజరాత్ ను రోల్ మోడల్ గా మార్చి, మోడీకి ఓ ఇమేజ్ ను తీసుకువచ్చారు భాజపాలోని ఓ వింగ్ నాయకులు. పలితంగా అధికారంలోకి వచ్చారు మోడీ. అక్కడి నుంచి రకరకాల జిమ్మిక్కులు చేస్తూ వస్తున్నారు. టీ మ్యాన్ అని బిసి మనిషి అని ఇలా రకరకాల ముసుగులు కప్పుతూ జనాల కళ్లకు మాయపొరలు కప్పుతూ వచ్చారు.
అవినీతి మచ్చ లేదు అన్న మాట తప్పించి మరే విధంగానూ మోడీ సర్కారు అద్భుతాలు చేసిన దాఖలాలు లేవు. సరికదా, నియంతృత్వ పోకడలు మెలమెల్లగా పెంచుకుంటూ వస్తున్నారు. జమిలి ఎన్నికలు అనే వార్తలు, అసలు ఎప్పడో అప్పటికి ఈ దేశ ప్రధాని పదవికి కూడా నేరుగా ఎన్నిక పెట్టేసి, అమెరికా తరహా పాలనకు శ్రీకారం చుడతారనే పీలర్లు వినిపిస్తూ వస్తున్నారు. ఆపరేషన్ చేసిన వారికి ఇచ్చిన సడేషన్ మెలమెల్లగా వీడినట్లు మోడీ మాయ అన్నది మెల్లమెల్లగా వీడడం ప్రారంభమైంది.
గత కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో లాక్ డౌన్ విధించే వరకు, మోడీ ప్రసంగాల వరకు వ్యవహారం బాగానే సాగింది. కానీ కేవలం ప్రసంగాలే తప్ప పైసలు విదల్చక పోవడం, 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రహసనం దగ్గర నుంచి మోడీ ప్రభ మసకబారడం ప్రారంభమైంది. నిజానికి మోడీ విషయంలో జనం చాలా ఆలస్యంగా మేలుకున్నారనే చెప్పాలి.
వివేకానంద శతజయంతి టైమ్ లో మోడీ మీడియా మేనేజ్ మెంట్ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది వి హెచ్ పి, ఆరెస్సెస్, భాజపా నేతలు ఎవరి పలుకుబడి వారు వాడి మోడీ అనుకూల కథనాలు స్థానిక మీడియాల్లో వండి వార్పించడం ప్రారంభించారు. నాయుడు కమ్ నాయకులు, మీడియా మొగళ్లు వారి వారి పరిచయాలు ఉపయోగించి సినిమా జనాలను గుజరాత్ తరలించి, మోడీ ఘనకీర్తిని ప్రచారం చేయడం ప్రారంభించారు. దేశం అంతటా ఇదే జరిగింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతోంది.
మధ్య తరగతికి ఒరిగింది సున్నా. ఎక్కడెక్కడ వున్నవారినీ ముక్కుకు తాడేసి, టాక్స్ పరిథిలోకి తీసుకువచ్చి, చెవులు పిండి పన్నుల వసూలు చేయడం అన్నది మోడీ తొలిఘనత. ఇందుకోసం డిజిటల్ ట్రాన్సాక్షన్లను జనాలకు అలవాటు చేసారు. ఇప్పటి వరకు ఏడేళ్లలో వేతన జీవులకు పన్నుల విషయంలో ఇచ్చిన వెసులుబాటు సున్నా. పైగా బ్యాంకుల్లో డబ్బులు దాచుకుని, వాటి వడ్డీతో బతికే వృద్దుల బతుకులు మరీ దుర్భరం అయిపోయాయి. వడ్డీ రేట్లు తొమ్మిది శాతం నుంచి నాలుగు శాతానికి పడిపోయాయి.
అదే సమయంలో యూనిఫారమ్ టాక్స్ సిస్టమ్ అని చెప్పి జిఎస్టీ ని ప్రవేశ పెట్టారు. దాంతో జనాలకు కుడి ఎడమల బాదుడు మొదలైంది. ఎవరి లెవెల్ లో వారికి జీఎస్టీ బాదుడు తప్పడం లేదు. పైగా రాష్ట్రాల ఆదాయాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకుని, తను వసూలు చేసి, తన చిత్తానికి పంపిణీ చేయడం అన్నది ప్రారంభమైంది. జిఎస్టీ రేట్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని చెప్పి, ఇటీవల కాలంలో ఆ వ్యవహారమే మరచిపోయారు. కరోనా కల్లోలం టైమ్ లో కూడా జిఎస్టీ రిజర్వ్ నుంచి రాష్ట్రాలకు ఇచ్చేది లేదు అని కేంద్రం తెగేసి చెప్పడం పరాకాష్ట.
సరే ఇన్ కమ్ టాక్స్, జిఎస్టీ వ్యవహారాలు ఇలా వుంటే, ధరల విషయంలో కూడా మోడీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. కరోనా అనంతరం ధరలు విపరీతంగా, ఘోరంగా పెరిగాయి. కరోనా వల్ల వచ్చిన నష్టాలను కరోనా పేరు చెప్పి, జీఎస్టీ పేరు చెప్పి విపరీతంగా పెంచేసారు. ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం దాదాపు చేతులు ఎత్తేసింది. ఎప్పడయితే పెట్రోలు రేట్లు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయాయో, అప్పటి నుంచి వ్యాపారాలకు మరింత అవకాశం దొరికింది. ఇంత దారుణమైన పరిస్థితి వున్నా, ఇప్పటికీ మీడియా గొంతు విప్పకపోవడం అన్నది గమనించాల్సిన విషయం. వంట గ్యాస్ సిలెండర్ రేటు ఎనిమిది వందలు దాటేసింది. చాలా స్మూత్ గా తెలివిగా సబ్సిడీ అన్నది పక్కకు పోయింది. సబ్సిడీ నేరుగా బ్యాంకులో వేయడం అన్నది ప్రహసనంగా మారి ఆఖరికి అదృశ్యమైపోయింది.
ఇలా గొంతు విప్పకపోవడం అన్నది ప్రస్తావనకు వస్తే, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ వుందని ప్రతిపక్షాలు, మేధావి వర్గాలు తరచు గోలపెట్టడం గుర్తుకు వస్తుంది. ఇప్పటికీ దేశంలో మీడియాలో మూడు వంతులు నోరు విప్పడం లేదు. సోషల్ మీడియా మాత్రమే కాస్త గట్టిగా యాక్టివ్ అయింది.
దీనికి తోడు దేశంలోని రాజకీయ పక్షాలకు వున్న సమస్యలు మోడీకి వరంగా మారిపోయాయి. కేసులు వున్న జగన్ మాట్లాడరు. కేసులు లేని చంద్రబాబు మాట్లాడరు. దాదాపు తొంభై శాతం రాజకీయ పక్షాలది ఇదే పరిస్థితి. గట్టిగా మాట్లాడితే ఇడి, సిబిఐ రంగంలోకి దిగిపోతాయి. పెట్రోలు ధరల మీద కనీసం ధర్నా చేసిన రాజకీయ పక్షాలను ఒక్క చేతి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చేమో?
సరే మిడిల్ క్లాస్ పన్నుల బాధలు, భావ ప్రకటన స్వేచ్ఛలు, రాజకీయ పార్టీల కష్టాలు అలా వుంచితే, దేశ వ్యాప్తంగా ఆదానీ, అంబానీల వ్యవహారాలు కూడా మోడీ ప్రభ మసకబారడానికి కారణం అవుతున్నాయి. కనిపించిన ప్రతి పోర్ట్ ను, ఎయిర్ పోర్ట్ ను, అదానీ తన పరం చేసుకుంటోంది. ఇవ్వకపోతే ఇడి రంగ ప్రవేశం చేస్తుందన్న భయం వెంటాడుతుంది. ముంబాయి ఎయిర్ పోర్ట్ విషయంలో జివికే అనుభవం జనాలకు తెలిసిందే.
కాంగ్రెస్ హయాలో బ్యాంకులకు రాని బాకీలు పెరిగాయి. మోడీ హయాంలో ఆ బాకీల కేసులు అన్నీ మూలన పడ్డాయి అన్నది టాక్ గా మారింది. బ్యాంకులకు బకాయి పడిన బడా బాబులంతా భాజపా శరణుజొచ్చి, అక్కడ హ్యాపీగా సేద తీరుతున్నారు. బాకీల కారణంగా కుదలైన బ్యాంకులను రెండు, మూడింటిని కలిపి ముడిపెట్టి వదిలించుకుంటున్నారు.
సరే, ఇవన్నీ ఇలా వుంటే పాలనలో నైతికత వుంటుంది అని భావించిన వారికి కూడా నేతి బీరకాయ లో నెయ్యి వ్యవహారంగా మారిపోయింది. వివిధ రాష్ట్రాల్లో అధికారం కోసం భాజపా పన్నిన వ్యూహాలు, వేసిన వేషాలు జనాలకు అర్థం అవుతూనే వున్నాయి. బెంగాల్ లో అన్ని విడతల పోలింగ్ ఎందుకు అన్నది తెలుస్తూనే వుంది. ఈ విషయంలో ప్రతిపక్షాల వేదన అరణ్య రోదన అవుతోంది.
నాయుడు నాయకుడు అంటూ భజన సాగించిన ఆంధ్ర జనం, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు అమ్మకం విషయంలో మోడీ వ్యవహారం ఆంధ్ర జనాలకు అర్థం అయింది. అవసరాలు వున్న రాష్ట్రాలకు ఒకలా, అవసరం లేని రాష్ట్రానికి మరోలా నిధులు, ఆఖరికి అవార్డులు కూడా అందిస్తున్న వైనంలో జనాలకు మోడీ మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
కరోనా తొలి దశ ప్రారంభంలో మోడీ చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. లాక్ డౌన్ అనే అస్త్రం వాడడంతో జనాలకు మోడీ మీద అపారమైన గౌరవం కలిగింది. మోడీ దీపం వెలిగించమంటే వెలిగించారు. గంట కొట్ట మంటే కొట్టారు. కానీ ఇలాంటి ఖర్చు లేని వ్యవహారాలే తప్ప, జనాలను ఆదుకునే వ్యవహారం అన్నది ఎక్కడా కనిపించకపోయే సరికి కళ్లు తెరుచుకున్నాయి. ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ ప్రహసనం ఎంత అభాసుపాలు అయిందో అందరికీ తెలిసిందే.
కరోనా రెండో దశ తరువాత మోడీ వ్యవహారంపై మరింత క్లారిటీ వచ్చింది. ఎక్కడ లాక్ డౌన్ అనౌన్స్ చేస్తే రాష్ట్రాలు మళ్లీ జీఎస్టీ నిధి కేసి చూస్తాయో, వలస కార్మికుల సమస్య ఎక్కడ వస్తుందో? జనాలకు సాయం చేయాలన్న డిమాండ్ లు పెరుగుతాయనో అనుమానం వుందో లేక బెంగాల్ ఎన్నికలు అడ్డం పడుతున్నాయో తెలియదు కానీ ఈసారి లాక్ డౌన్ అన్నది వదిలేసారు.
ట్రేస్, ట్రాక్, ట్రీట్ అన్న కరోనా నివారణ ఉపాయాన్ని గాలికి వదిలేసారు. కేంద్రం ఎప్పుడయితే వదిలేసిందో రాష్ట్రాలు కూడా ఈ వ్యవహారాన్ని వదిలేసాయి. పది కేసులు వున్నపుడే లాక్ డౌన్ పెట్టారు కాబట్టి వేలు లక్షలు కాకుండా ఆగింది. కానీ ఇప్పుడు అలా చేయలేదు కాబట్టి కేసలు లక్షలకు లక్షలు అయిపోయాయి. ఇక్కడ కూడా మోడీ ప్రభుత్వం నెగిటివ్ మార్కులు మూటకట్టకుంది.
బెంగాల్ ఎన్నికల ర్యాలీలు, హరిద్వార్ కుంభమేళా కలిసి కరోనాపై మోడీ ద్వంద వైఖరిని చాటి చెప్పాయి. గత ఏడాది వేరే మతం వారిని కరోనా నేపథ్యంలో ఎలా వెంటాడి టార్గెట్ చేసారో జనాలకు గుర్తు వుంది. ఇప్పుడు మరో మతం కుంభమేళా చేసుకుంటే చిన్నపాటి హడావుడి కూడా లేదు.
దేశం అంతా మోడీ వ్యవహార శైలిని అర్థం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు గొంతు ఎత్తుతున్నాయి. ప్రతిపక్షాలు ఇప్పుడిప్పుడే బలోపేత అవుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి మోడీకి అంత సులువుగా విజయం సిద్దిస్తుందా అన్నది అనుమానం. ఇక్కడ మోడీకి మిగిలింది ఒక్కటే జగన్, కేసిఆర్ లాంటి వాళ్లకు వున్న బలహీనతల. వీళ్లే కాదు దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు అన్నీ వాటి వాటి కారణాలతో మోడీ వెనుక నిలవడానికి రెడీగా వున్నాయి.
దేశ రాజకీయ వేదిక మీంచి సోనియా తప్పుకున్నారు. రాహుల్ కేవలం విమర్శలు ప్రచారం విషయంలో తప్ప, తనకంటూ ఒక సెట్ ఆఫ్ పార్టీలను సెట్ చేసకోవడంలో విపలమయ్యారు. అందువల్ల జనం బలంగా తలుచుకుని భాజపా అనుకూల పక్షాలను పక్కన పెడితే తప్ప, మోడీ మాయాజాలం నుంచి ఈ దేశం తప్పించుకోవడం అసాధ్యం.
No comments:
Post a Comment