హామీ లేని భేటీ
Jun 26,2021 07:07
https://www.prajasakti.com/haaamaii-laeenai-bhaeetaii
హత్య చేసి హంతకుడే సంతాప సభ నిర్వహించేందుకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందో ఇప్పుడు జమ్ము-కాశ్మీర్ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం జరిపిన సమావేశం అలానే అనిపిస్తుంది. విశేష చారిత్రక నేపథ్యంతో జమ్ము-కాశ్మీర్‌కున్న ఆర్టికల్ 370ని కనీస సంప్రదింపులు కూడా లేకుండా అత్యంత నిరంకుశంగా 2019 ఆగస్టు 5న రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ముక్కలు చేసిన సంగతి తెలిసిందే. అటు ఉగ్రవాద మూకలు, ఇటు సొంత సైనికుల దాడుల మధ్య నిత్యం నలిగిపోతూ పరాయీకరణ భావనతో సతమతమౌతున్న కాశ్మీర్ ప్రజానీకాన్ని అక్కున చేర్చుకొని భారత జన స్రవంతిలో మమేకం చేయాల్సిన కేంద్రం ఆ బాధ్యతను విస్మరించి నిర్బంధకాండ సాగిస్తూ వచ్చింది. వైద్యం వంటి అత్యవసర సేవలకు ఇంటర్నెట్ అవసరమని మొత్తుకున్నా అంతులేని ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ సమాజం సైతం ఈ ఆంక్షలను, నిర్బంధ చర్యలను తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో జమ్ము-కాశ్మీర్ రాజకీయ పక్షాల నేతలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలకు ఆహ్వానించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎజెండా ఏదీ కేంద్రం ప్రస్తావించకపోయినా..ప్రజాస్వామ్య ఒరవడికి చర్చలు ఆయువుపట్టు అని భావించిన జమ్ము-కాశ్మీర్ నేతలు షరతులేవీ పెట్టకుండానే సమావేశంలో పాల్గొనడం ముదావహం.
నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించగా..కాశ్మీర్ నేతలు 2019 ఆగస్టు 5 నిర్ణయాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. సమావేశం బాగా జరిగిందని, ప్రగతిశీల జమ్ము-కాశ్మీర్ దిశగా కొనసాగుతున్న ప్రయత్నాల్లో ఇది ఒక ముఖ్యమైన దశ అని, అలాగే మూలాల నుంచి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని చర్చల అనంతరం మోడీ సెలవిచ్చారు. కానీ ఆ సమావేశంలో ఆ దిశగా హామీ ఏదీ ఇవ్వకపోవడం గమనార్హం. శీఘ్రమే నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోవాలని కేంద్రం ఉద్ఘాటించినందున రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశం వారి ప్రాధమ్యంలో లేనట్టే కనిపిస్తోంది. ఒక వేళ పునరుద్ధరణకు సిద్ధమైతే కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ము-కాశ్మీర్‌కు ఎన్నికలు జరపాల్సిన అవసరమే ఉండదు. నియోజకవర్గాల పునర్విభజన ఊసూ ఉండదు. ఒక వేళ హామీ ఇచ్చినా..ఆర్టికల్ 370 రద్దు చేసిననాడే తగిన సమయంలో జమ్ము-కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ప్రకటించినందున అదేమీ ఇప్పుడు కొత్త కాదు.
కేేంద్ర పాలిత ప్రాంతంగా జరిగే ఎన్నికల్లో గెలిచేదెవరైనా పెత్తనం కేంద్రానిదే. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం పట్టు పడుతున్నది ఆ పెత్తనం కోసమే. గతంలో మాదిరి ఏకపక్ష ధోరణి ప్రదర్శించకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేశామని చెప్పుకోవడానికే ఈ సమావేశం తప్ప కాశ్మీరీల క్షేమం కోరి మాత్రం కాదన్నది స్పష్టం. కేంద్రం కోరినట్టు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)ను అంగీకరించడమంటే రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాన్ని విస్మరించడమే. చర్చలకు హాజరైన నేతలు ప్రధానంగా పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పిఎజిడి)కి చెందిన ఆరు పార్టీల నేతల అభిప్రాయాల్లోనూ ఈ ఆందోళనే వ్యక్తమైంది. అందువల్లే రాజ్యాంగ హక్కులను లాగేసుకున్న కేంద్రం జమ్ము-కాశ్మీర్‌కు తిరిగి ఆ హక్కులను పనరుద్ధరించాలని, ఆగస్టు 5 నాటి చర్యను ఎంతమాత్రమూ అంగీకరించబోమని ప్రధాని ఎదుటే వారు కుండబద్దలు కొట్టారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ తాను చెప్పిందే వేదం అన్నట్టు ఏకపక్ష నిర్ణయాలతో దూకుడు కొనసాగించిన మోడీ సర్కార్‌కు ఇటీవల ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీహార్‌తో మొదలైన పరాభవాల పరంపర ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ ప్రజాగ్రహ తీవ్రతను బాగానే రుచి చూసింది. ఢిల్లీ పీఠంపై పట్టుకు అత్యంత ప్రధానమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఇంకోవైపు తరుముకొస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సొంతింటి కుమ్ములాటలు పెరుగుతున్నాయి. ఒంటెత్తు పోకడలు చెల్లుబాటు కాబోవనే 'ప్రజాస్వామ్య' ముసుగు తొడిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జమ్ము-కాశ్మీర్ 2019 ఆగస్టు 5 నాటికి ముందున్న రీతిలో ప్రత్యేక ప్రతిపత్తితో సహా అంతా పునరుద్ధరించడమే పరిష్కారం. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి.
No comments:
Post a Comment