Monday, March 25, 2024

TDP: టీడీపీకి అరుదైన ఘనత.. ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరణ..

 TDP: టీడీపీకి అరుదైన ఘనత.. ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరణ..

ABN , Publish Date - Mar 25 , 2024 | 08:23 PM

తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంతో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ నేడు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చొరవతో అరుదైన రికార్డును సాధించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం నిలిచింది. ఈ కూటమిలో బీజేపీ తర్వాతి స్థానం టీడీపీదే కావడం విశేషం. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ టీడీపీనే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ వ్యాప్తంగా ఎన్డీఏ మిత్రపక్షాల పొత్తులు ఓ కొలిక్కి రావడంతో సీట్ల సర్దుబాటు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన సైతం దాదాపుగా పూర్తయింది.

దేశవ్యాప్తంగా ఉన్న 543 స్థానాల్లో ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అత్యధికంగా ఐదు విడతల్లో 445 మంది లోక్ సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ క్రమంలో బీజేపీ తర్వాత ఎన్డీఏలో అత్యధికంగా 17 లోక్ సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తూ రెండో స్థానంలో నిలిచింది. ఎన్డీఏ కూటమిలోనే ఉన్న జేడీయూ 16 స్థానాలు, శివసేన షిండేవర్గం 13, పీఎంకే 10, ఎన్సీపీ అజిత్ పవార్ 5, లోక్ జనశక్తి 5 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.