దీదీ హ్యాట్రిక్ మోదీకి చెక్!
May 3 2021 @ 02:44AMహోంజాతీయం
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ అపూర్వ విజయం
గత రెండు ఎన్నికల కంటే ఎక్కువ సీట్లలో గెలుపు
మమత పార్టీకి మూడింట రెండొంతుల స్థానాలు
సర్వశక్తులూ ఒడ్డినా బీజేపీకి దక్కని విజయం
అసెంబ్లీలో 3 నుంచి 75కు పెరిగిన ఆ పార్టీ బలం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు మినహా అధికార పార్టీలనే ప్రజలు ఆదరించారు. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కనబెట్టి గెలుపు తీరాలకు చేర్చారు. ప్రాంతీయ పార్టీలకు పెద్దపీట వేశారు. ఎన్నికల చరిత్రలోనే హైటెన్షన్‌తో హోరాహోరీగా ప్రచారం జరిగిన పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తుది ఫలితాలు వెలువడే సరికి.. వాటిలో, ఏకంగా 213 సీట్లలో తృణమూల్ ఘన విజయం సాధించింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ఇతర రాష్ట్రాల తరహాలో ముస్లిముల ఓట్లు చీలిపోకుండా అడ్డుకోవడంలో మమత విజయం సాధించారని, ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్న ముస్లిములంతా గుండుగుత్తగా తృణమూల్‌కే ఓటేశారని విశ్లేషిస్తున్నారు. కాకపోతే, తృణమూల్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన సువేందు అధికారితో నువ్వానేనా అన్నట్లుగా నందిగ్రామ్‌లో బరిలోకి దిగిన మాత్రం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు.
చివరి రౌండ్ వరకూ ఇక్కడ ఉత్కంఠగా జరిగిన కౌంటింగ్‌లో చివరకు తన మాజీ బాస్‌పై సువేందు విజయ బావుటా ఎగురవేశారు. గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి 77 స్థానాలను కైవసం చేసుకుని ఉనికిని బలంగా చాటింది. కానీ, హైటెన్షన్ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. అంతేనా, రెండేళ్ల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. బెంగాల్లోని 18 ఎంపీ సీట్లను బీజేపీ, 22 ఎంపీ సీట్లను తృణమూల్ గెలుచుకున్నాయి. అంటే, దాదాపు 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పట్లో బీజేపీ పాగా వేసింది. కానీ, రెండేళ్లలోనే దాదాపు 46 స్థానాల్లో కమలం ప్రభ తగ్గిపోయినట్లు చెబుతున్నారు. ఇక, ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్.. రెండున్నర దశాబ్దాలపాటు అప్రతిహతంగా చక్రం తిప్పిన వామపక్షాలు బెంగాల్లో నామరూపాల్లేకుండాపోయాయి. వామపక్షాలు కనీసం ఖాతా కూడా తెరవలేదు. గత ఎన్నికల్లో 44 సీట్లు గెలిచి రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్.. 33 స్థానాల్లో గెలిచిన వామపక్షాలు ఇప్పుడు ‘శూన్యం’గా మిగిలాయి. ఇక, తమిళనాట వారసుడొచ్చాడు. కొన్ని దశాబ్దాలపాటు తమిళనాడును శాసించిన కరుణానిధి, జయలలిత లేకుండా జరిగిన ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికితోడు, ద్రవిడ రాష్ట్రంలో అన్నాడీఎంకే, బీజేపీ జట్టు కట్టడంపైనా ఆసక్తి నెలకొంది. మిగతా రాష్ట్రాల్లో అధికార పార్టీలే మళ్లీ అధికారాన్ని దక్కించుకున్నా.. తమిళనాట మాత్రం అన్నాడీఎంకేకు ఎదురు దెబ్బ తగిలింది.
రాష్ట్ర అసెంబ్లీలో 234 స్థానాలు ఉండగా.. డీఎంకే కూటమి 157 సీట్లలో ఘన విజయం సాధించింది. అన్నాడీఎంకే కూటమి 77 స్థానాలకే పరిమితమైంది. ఇప్పటి వరకూ ఖాతా తెరవని బీజేపీ.. తమిళనాట ఈసారి ఐదు స్థానాల్లో విజయం సాధించడం విశేషం. ఇక, ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ తెరపైకి వచ్చిన కమలహాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం చతికిలబడింది. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కమలహాసన్ స్వయంగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక, సంప్రదాయానికి భిన్నంగా కేరళ ఓటేసింది. వరుసగా రెండోసారి ఏ పార్టీనీ ఆదరించని ఆ రాష్ట్రం.. ఇప్పుడు ఎల్డీఎ్‌ఫను మళ్లీ అక్కున చేర్చుకుంది. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదలను; దేశంలోనే తొలిసారిగా కేరళలో అడుగుపెట్టి విలయం సృష్టించిన కరోనాను సమర్థంగా నిభాయించిన విజయన్‌ను విజయ తీరాలకు చేర్చింది. కేరళ అసెంబ్లీలో 140 స్థానాలు ఉండగా.. ఎల్డీఎఫ్ 99 స్థానాలను సాధించింది. అధికారంపై ఆశలు పెట్టుకున్న యూడీఎఫ్ మాత్రం గత ఎన్నికల ఫలితాల (41)తోనే సరిపెట్టుకుంది. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ.. ఈసారి దానిని కూడా కోల్పోవడం గమనార్హం. మరోవైపు, అసోంలో అధికార ఎన్డీయే కూటమికే ప్రజలు పట్టం కట్టారు. గత ఎన్నికల్లో సాధించిన 59 సీట్లనే బీజేపీ ఇప్పుడు కూడా దక్కించుకుంది. అసోం గణపరిషత్ మాత్రం అప్పట్లో సాధించిన 11 స్థానాల్లో ఒకదానిని కోల్పోయింది. కాకపోతే, కాంగ్రెస్ ఐదు సీట్లను పెంచుకుని 32 స్థానాల్లో విజయం సాధించింది. పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజయ తీరాలకు చేరింది. యూపీఏ ఎనిమిది సీట్లకే పరిమితమైంది. అయితే, స్థానిక పరిస్థితులకుతోడు సెంచరీకి చేరువవుతున్న పెట్రో ధరలు; వాటి కారణంగా ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలపై ప్రజలు తమ నిరసనను ఓటు రూపంలో వ్యక్తం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడానికితోడు బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలనూ తిరస్కరించారని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఫలితాలకు ఇవే కారణమని వివరిస్తున్నారు. చివరిగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహం మరోసారి ఫలించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఆయన వ్యూహాలు అందించిన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించాయి. బెంగాల్లో బీజేపీ డబుల్ డిజిట్ దాటదన్న ఆయన అంచనా కూడా నిజమైంది. అలాగే, కరోనా విలయంలో సమర్థంగా పని చేసిన ముఖ్యమంత్రులను ప్రజలు ఆదరించారు. మహారాష్ట్రతో పోటీ పడి కేసులు నమోదైనా.. మరణాల రేటు దేశంలోనే అత్యల్పంగా ఉన్న కేరళలో విజయన్ విజయానికీ ఇదే కారణమని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో మమత విజయాలకు కారణాల్లో ఇది ఒకటిగా వివరిస్తున్నారు. కరోనా విజృంభన నేపథ్యంలో.. అక్కడ చివరి మూడు దశలను ఒకేసారి నిర్వహించి ఉంటే.. బీజేపీకి మరింత మంచి ఫలితాలు వచ్చి ఉండేవని విశ్లేషకులు అంటున్నారు.
No comments:
Post a Comment