May 17 2021
రామరాజ్యాన్నేలుతున్న ఓ నగ్న చక్రవర్తీ.. శవవాహిని గంగను చూడయ్యా!
ప్రధాని లక్ష్యంగా గుజరాతీ మహిళ కవితాస్త్రం
గంగానదిలో శవాలపై కన్నీటి అక్షరాలు
అహ్మబాద్, మే 16: దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తుండటం.. ప్రజలు పిట్టలా రాలుతుండటంపై.. గంగానదీ ప్రవాహంలో శవాల కుప్పలు కొట్టుకొస్తుండటంపై ఆ కవయిత్రి తన కన్నీటినే సిరాగా చేసుకొని ఆవేదననంతా అక్షరబద్ధం చేశారు. దేశంలో నెలకొన్న దయనీయ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని కలం ఝళిపించారు. ఈ పరిస్థితులకు ప్రధాని మోదీయే కారణమని చెబుతూ ఆయన్ను ‘‘రామరాజ్యాన్నేలుతున్న నగ్న చక్రవర్తి’’గా అభివర్ణించారు! పవిత్రమైన గంగానది శవాల కుప్పతొట్టిగా మారిందని గుర్తుచేస్తూ ‘ఓ ప్రభూ.. మీ ఆదర్శ రాజ్యంలో గంగానది ఘోషను వింటున్నారా?’ అని మోదీని ఆమె ప్రశ్నించారు. ఆ కవయిత్రి.. మోదీ పుట్టిన గడ్డ గుజరాత్ వాస్తవ్యురాలు.. పైగా ‘రానున్న కాలంలో గుజరాత్ కవితాజగత్తుకు ప్రతిరూపం’ అని ఒకప్పుడు సాక్షాత్తు బీజేపీ శ్రేణులు అభివర్ణించిన 51 ఏళ్ల పారుల్ ఖక్కర్! ‘శవవాహిని గంగ’ శీర్షికతో గుజరాతీ భాషలో ఆమె 14 పంక్తులతో కూడిన కవితను రాశారు. దీన్ని ఈనెల 11న సోషల్ మీడియాలోని తన ఖాతాలో పోస్టు చేశారు. అయితే దేశంలోని ఔత్సాహిక కవులు.. ఆమె కవితను అస్సామీ, హిందీ, ఇంగ్లిషు, తమిళం, భోజ్‌పూరి, మలయాళం, బెంగాలీ భాషల్లో అనువదించి సోషల్ మీడియాలో పెట్టారు. ‘ఓ ప్రభూ.. ప్రతి ఇంట్లోనూ యముడు భీకర నృత్యం చేస్తున్నాడు. మా గాజులే కాదు.. గుండెలూ ముక్కలవుతున్నాయి’ వంటి ఆవేదనా పూరితమైన లైన్లు కవితలో ఉన్నాయి. ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో మీడియా, విపక్షాలు.. మౌనపాత్ర పోషిస్తున్నాయని చురకలంటించారు. కాగా ప్రసిద్ధ రచయిత మృణాల్ పాండే, నవనిర్మాణ్ ఆందోళన్ అధ్యక్షుడు మనిషి జానీ ఈ కవితను ప్రశంసించారు. బీజేపీ శ్రేణులు మాత్రం ఖక్కర్‌పై భగ్గుమన్నాయి.
No comments:
Post a Comment