మోదీ గ్రాఫ్ పడిపోతోందా?
May 3 2021 @ 02:33AMహోంజాతీయం
ప్రజలను ఆకట్టుకోలేకపోతున్న ప్రసంగాలు!
భావోద్వేగాల కన్నా సమస్యలకే ప్రజల ప్రాధాన్యం
ఆరెస్సెస్ వర్గాల్లోనూ ఇవే అభిప్రాయాలు!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో స్పష్టం
ఎక్కడా ఆశించిన స్థాయిలో రాణించని బీజేపీ
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంపై అంచనాలు
మమత నేతృత్వంలో ప్రాంతీయ కూటమి ఏర్పాటు!
భాగస్వామిగా కాంగ్రెస్ చేరక తప్పని పరిస్థితి
న్యూఢిల్లీ, మే 2 (ఆంధ్రజ్యోతి): దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అవతరించే సమయం ఆసన్నమవుతోందా? ప్రధాని నరేంద్రమోదీ గ్రాఫ్ పడిపోతోందా? అంటే.. అవుననే అభిప్రాయాలే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. హిందుత్వ భావజాలంతో మొత్తం దేశ ప్రజల మనోభావాలను ఆకర్షించి, మధ్యతరగతినీ ఆకట్టుకున్న మోదీ ప్రభావం క్రమంగా తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. మోదీ మాటలు, చేతలు, హావభావాలు ప్రజలపై ముద్రవేసే రోజులు పోయాయని ఆరెస్సెస్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అన్నిరకాల ఆయుధాలు వాడినా బీజేపీ విఫలం కావడం, ఇతర రాష్ట్రాల్లో కూడా మోదీ ప్రభావం పెద్దగా కనిపించకపోవడం ఇందుకు కారణమని అంటున్నారు. నిజానికి పశ్చిమబెంగాల్‌లో బీజేపీ సంధించిన అస్త్రాలు, పన్నిన వ్యూహాలతో ఆ పార్టీ అఖండ విజయం సాధించే అవకాశాలుండేవని, కానీ.. కేవలం ప్రతిపక్షాల స్థానాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మమతా బెనర్జీకి బీజేపీ ఏమాత్రం నష్టం చేకూర్చలేకపోయిందని భావిస్తున్నాయి. 2016 ఎన్నికల్లో మమతా బెనర్జీకి వచ్చిన సీట్లకూ, 2021లో వచ్చిన సీట్లకూ పెద్ద తేడా లేదని, కాంగ్రెస్, వామపక్షాలు దాదాపు తుడిచిపెట్టుకుపోవడంతో
వాటి స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకోగలిగిందని ఈ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో కూడా బీజేపీ అన్నాడీఎంకేతో చేతులు కలిపినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేరళలో 2016లో బీజేపీ ఒక స్థానంలో పాగా వేయగా.. ఇప్పుడు అది కూడా పోయింది. కాగా, అసోంలో గత ఎన్నికల్లో 86 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి ఏకంగా 11 సీట్లు కోల్పోయింది.
సంఘటితం కాని హిందూ ఓటర్లు..!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. బీజేపీ ఆశించినట్లుగా హిందూ ఓటర్లు సంఘటితం కానట్లు, ప్రజలు భావోద్వేగాల కన్నా తమ సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈనేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్షాలు గతంలో కంటే సంఘటితంగా వ్యవహరించి మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ సంఖ్యాబలం 300 కాగా.. ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిసి 329 సీట్లు ఉన్నాయి. మిగిలిన 216 సీట్లు ప్రతిపక్షాలకు ఉన్నాయి. వీటిలో బీజేడీ(12 సీట్లు), బీఎస్పీ(10) మాత్రం తటస్థంగా ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లోంచే ఎక్కువ మంది సభ్యులు ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. దీంతో.. రాజ్యసభలో కూడా బీజేపీకి ప్రతిపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావచ్చని అంటున్నారు.
కేంద్ర వ్యవస్థలు మాట వినవా!
భవిష్యత్తులో 3 కారణాలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో ఒకటి.. హిందుత్వ ఓటర్లు సంఘటితమయ్యే అవకాశాలు లేకపోగా మైనారిటీల ఓట్లు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకం కావడం. రెండోది.. మోదీ ఆకర్షణ క్రమంగా తగ్గిపోయి, ఆయన ఉపన్యాసాలు జనానికి విసుగు కల్పించడం. మూడోది.. మోదీ ప్రభావం తగ్గిపోవడం వల్ల బీజేపీలో లుకలుకలు బయలుదేరడం, వివిధ కేంద్ర సంస్థలు, వ్యవస్థలు మోదీ, అమిత్ షా ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే అవకాశాలు తగ్గిపోవడం. అయితే ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మోదీ సర్దుబాటు చర్యలు తీసుకుంటారా, ప్రతిపక్షాలు సంఘటితమై, బలమైన జాతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచగలరా అన్న అంశాలపై భవిష్యత్తు పరిణామాలు ఆధారపడి ఉంటాయని రాజకీయ వర్గాల అంచనా.
మమత కేంద్రంగా ప్రత్యామ్నాయ వేదిక!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యం నేపథ్యంలోజాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అది కూడా మమతా బెనర్జీ నాయకత్వంలో ఏర్పాటయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మమతా బెనర్జీ దాదాపు 15 పార్టీలకు లేఖ రాశారు. వీటిలో కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, శివసేన, జేఎంఎం, ఆప్, బీజేడీ, వైసీపీ, టీఆర్‌ఎస్, సమాజ్‌వాది, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ తదితర పార్టీలున్నాయి. ఇప్పటికే డీఎంకే, ఆర్‌జేడీ, ఎన్సీపీ, శివసేన, సమాజ్‌వాది పార్టీ.. బెంగాల్ ఎన్నికల్లో మమతకు అండదండగా నిలిచాయి. మమతా బెనర్జీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఏర్పడే అవకాశాలుంటాయని, కాంగ్రెస్ సహా మెజారిటీ పార్టీలు ఈ సంఘటనకు మద్దతు ఇవ్వవచ్చని తెలుస్తోంది. రాహుల్‌గాంధీ ఎంత ప్రచారం చేసినా ఐదు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం కనిపించనందున.. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు లేవని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీయే వాస్తవాలకు అనుగుణంగా జాతీయ ప్రత్యామ్నాయంలో ఒక భాగస్వామిగా మారక తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment