Sunday, December 29, 2019

ప్రపంచశక్తిగా ప్రత్యేక ముద్ర - India

ప్రపంచశక్తిగా ప్రత్యేక ముద్ర
దృఢసంకల్పంతో విశిష్ట విధానాలు

భారత విదేశాంగ విధానానికి 2019 సంవత్సరం కొత్త దారులు తెరచింది. ఈ సంవత్సరం భారీ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచంలో శక్తిమంతమైన రాజ్యాల సరసన నిలపడానికి దృఢ సంకల్పంతో ముందడుగు వేసింది.  ఈ బృహత్తర కృషి విజయవంతంగా సాగడానికి అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆరితేరిన, రాటుతేలిన ఎస్‌.జయశంకర్‌ను విదేశాంగ మంత్రిగా నియమించింది. ఆయన 2015-18 మధ్య విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. అమెరికా, చైనాలమధ్య స్పర్థలు తారస్థాయికి చేరిన సమయంలో భారతదేశానికి గరిష్ఠ ప్రయోజనాలను సాధించిపెట్టే నేర్పు, అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. అంతర్జాతీయ సంబంధాల్లో చురుకైన పాత్ర పోషించడానికి జయశంకర్‌ సారథ్యంలో భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే దీనికి మొదటి సవాలు చైనా నుంచి ఎదురైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వం సాధించకుండా మోకాలడ్డుతున్న చైనా, 2019 ఆగస్టులో భారత్‌-పాకిస్థాన్‌ సమస్యను మళ్ళీ లేవనెత్తింది. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశంగా తనకున్న హోదాను భారత్‌కు వ్యతిరేకంగా ప్రయోగించింది. భారత్‌-పాక్‌ సమస్య గురించి భద్రతా మండలి చివరిసారి చర్చించినది- 1971 డిసెంబరులో. చైనా ఇప్పుడు దాన్ని తిరగదోడటంతో కశ్మీర్‌ సమస్యపై భారత్‌, పాక్‌లు మళ్ళీ దౌత్యపరంగా ఘర్షణపడటం అనివార్యమైంది. అక్టోబరులో భారత్‌-చైనాల మధ్య చెన్నైలో అనధికారిక శిఖరాగ్ర సమావేశం జరిగినా, చైనా బహుముఖ విన్యాసాల వల్ల ఆ సభ ఏమీ ఒరగబెట్టలేకపోయింది. రెండు దేశాల మధ్య నిర్మాణాత్మక సంభాషణలకు పునాది వేయలేకపోయింది.

పాక్‌కు పగ్గాలు
ఫిబ్రవరిలో పుల్వామాలో భారత భద్రతా దళాలపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడి రెండు దేశాల సంబంధాలను పాతాళానికి చేర్చింది. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో గల ఉగ్రవాద శిబిరాలపై భారతీయ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. దాంతో భారత్‌తో దౌత్య సంబంధాలను ఆగస్టులో పాక్‌ ఏకపక్షంగా తగ్గించుకుంది. సెప్టెంబరు నుంచి వివిధ అంతర్జాతీయ వేదికలపై జమ్మూకశ్మీర్‌ విషయంలో భారత్‌ మీద తీవ్ర దుష్ప్రచారం మొదలుపెట్టింది. అలాగని రెండు దేశాల మధ్య వైమనస్యం తప్ప సామరస్యం లేదని భావించనక్కర్లేదు. పాకిస్థాన్‌లో సిక్కు మతస్థులకు పరమపవిత్రమైన స్థలానికి భారతీయులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించడానికి వీలుగా నవంబరులో కర్తార్‌పూర్‌ నడవాను ప్రారంభించారు. రెండు దేశాల ప్రజల మధ్య సౌహార్దం నెలకొనడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. భారతదేశం పొరుగున నిరుడు ఎన్నో కీలక రాజకీయ పరిణామాలు సంభవించాయి. వీటి మధ్య పొరుగు దేశాలతో సంబంధాలను నిలబెట్టుకుంటూనే వాటిని మరింత పటిష్ఠపరచుకోవడంలో భారత్‌ సఫలమైంది. పాకిస్థాన్‌ పెడసర ధోరణి వల్ల భారతదేశం 2014 నుంచి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్‌) వ్యవహారాలకు ప్రాధాన్యం తగ్గించసాగింది. దానికి బదులు బంగాళాఖాత సమీప దేశాలతో ఏర్పడిన ‘బిమ్‌స్టెక్‌’ను పటిష్ఠపరచడానికి గట్టిగా కృషి చేసింది. 2019లో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బంగ్లాదేశ్‌,   భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక, మియన్మార్‌ దేశాల నాయకులు అతిథులుగా రావడం మన కృషి ఫలించిందనడానికి నిదర్శనం. రెండోసారి ప్రధాని పదవి చేపట్టగానే నరేంద్ర మోదీ తొలి పర్యటనకు మాల్దీవులను ఎంచుకోవడం, శ్రీలంక కొత్త అధ్యక్షుడి తొలి పర్యటన భారత్‌లోనే కావడం ‘బిమ్‌స్టెక్‌’ దేశాల మధ్య పెరుగుతున్న మైత్రీబంధానికి ప్రతీకలు. పొరుగు దేశాలకు ప్రాధాన్యమిచ్చే విదేశాంగ విధానాన్ని భారత్‌ అనుసరించడం వల్లనే ఇది సాధ్యపడింది.

‘తూర్పు దిశగా చొరవ’ విధానం కింద బంగ్లాదేశ్‌, మియన్మార్‌లతో సంబంధాలను మెరుగుపరచుకోవడంలో భారత్‌ సఫలమైనా, ఈశాన్య భారతంలో పెరుగుతున్న అలజడులు ముల్లులా పొడుస్తున్నాయి. అవి ‘తూర్పు దిశగా’ కార్యాచరణకు అడ్డుపడేలా ఉన్నాయి. డిసెంబరు మధ్యలో గువహటిలో జరగాల్సిన భారత్‌-జపాన్‌ శిఖరాగ్ర సభ వాయిదా పడటం దీనికి ఓ ఉదాహరణ. ఆర్‌సీఈపీలో చేరరాదని భారతదేశం నిర్ణయించడం ఈ ఏడాది సంభవించిన మరో ముఖ్య పరిణామం. ఇది కూడా ‘తూర్పు దిశగా’ కార్యాచరణకు విఘాతమే. చైనా, జపాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌, ఆగ్నేయాసియా దేశాల సంఘం కలిసి ఏర్పాటు చేసుకోదలచిన ఆర్థిక కూటమి-ఆర్‌సీఈపీ కూటమి దేశాల్లో దాదాపు సగం ప్రపంచ జనాభా నివసిస్తోంది. ఈ దేశాలన్నీ కలిసి 39 శాతం ప్రపంచ జీడీపీని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంతటి కీలకమైన కూటమిలో భాగస్వామి కాకపోతే భారత్‌ అపార ఆర్థిక అవకాశాలను వదులుకోవలసి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల మన విదేశాంగ విధాన లక్ష్యాలను నెరవేర్చుకోవడమూ కష్టం కావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోనీ, ఆర్‌సీఈపీకి దీటైన ఆర్థిక సహకార కూటమి ఏదైనా భారత్‌ ముంగిట ఉన్నదా అంటే అదీ లేదు. ప్రపంచీకరణ వెనకపట్టు పడుతున్నందువల్ల దేశాలు కొన్ని బృందాలుగా ఏర్పడి పరస్పరం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్న రోజులివి. ఈ సంక్లిష్ట సందర్భంలో భారత్‌ ఏకాకిగా మిగలడం శ్రేయస్కరం కానే కాదు.

ఈ నేపథ్యంలో ఇండో-పసిఫిక్‌ కూటమి స్పష్టమైన రూపు ధరిస్తే భారత్‌ ప్రయోజనాలు చాలావరకు నెరవేరతాయి. అమెరికా, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియాలతో ఈ కూటమి రూపుదాల్చవలసి ఉంది. తన సార్వభౌమత్వాన్ని పదిలపరచుకుంటూనే ఇండో-పసిఫిక్‌ కూటమిలో కొనసాగాలని భారత్‌ యోచిస్తోంది. హిందూ మహాసముద్రంలోని చాగోస్‌ దీవుల నుంచి బ్రిటిష్‌ వలస పాలన యంత్రాంగం ఆరు నెలల్లో వైదొలగాలని కోరుతూ గత మే నెలలో మారిషస్‌ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్‌ బలపరచింది. ఈ ద్వీప సముదాయంలోని డీగో గార్సియా దీవిని బ్రిటన్‌ గతంలో అమెరికాకు అప్పగించగా, వాషింగ్టన్‌ అక్కడ ఒక వైమానిక స్థావరాన్ని నెలకొల్పింది. ఇండో-పసిఫిక్‌ కూటమిలో గల్ఫ్‌ దేశాలు, అరేబియా సముద్రంలోని ద్వీపదేశాలు, ఆఫ్రికా తీర దేశాలను కూడా కలుపుకొని పోవాలని భారత్‌ గట్టిగా ప్రతిపాదించింది. ఇండో-పసిఫిక్‌ కూటమి పరిధిని ఈ విధంగా విస్తరించదలచింది. చెన్నై నుంచి రష్యా దూరప్రాచ్య రేవు వ్లాదీవోస్తోక్‌కు సముద్ర రవాణా మార్గాన్ని ఏర్పరచబోతున్నట్లు సెప్టెంబరులో కీలక ప్రకటన వెలువడింది. తద్వారా భారత్‌ ఇండో-పసిఫిక్‌ కూటమిలో రష్యానూ భాగస్వామిని చేయడానికి అడుగులు వేసింది.

సుహృద్భావమే గీటురాయి
ప్రపంచశక్తిగా ప్రత్యేక ముద్ర
ఈ సంవత్సరంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌లతో భారత్‌ అంశాలవారీగా సంబంధాలు నెరపింది. కొన్నింటిపై ఏకాభిప్రాయం, మరికొన్ని అంశాలపై భేదాభిప్రాయాలు ఉండవచ్చు. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం కాకుండా దేనికదే అన్నట్లు వ్యవహారం నడిపింది. భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్యపరంగా భేదాభిప్రాయాలు ఉన్నా రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం బలపడింది. డిసెంబరులో రెండు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల (2+2) సమావేశంలో ఇది సుస్పష్టమైంది. భారతదేశంలో ఆయుధ విడిభాగాల తయారీకి రష్యా తోడ్పడనుంది. దీనికోసం సంయుక్త పరిశ్రమలు నెలకొల్పాలని అంగీకారం కుదిరింది. రష్యా దూరప్రాచ్యంలో వ్యాపార అభివృద్ధికి భారత్‌ 100 కోట్ల డాలర్ల రుణ సహాయం అందించనుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, నిపుణులు పనుల కోసం తాత్కాలిక ప్రాతిపదికపై అక్కడికి వెళ్లే సౌలభ్యం ఏర్పడుతుంది. భారత్‌-రష్యాల చిరకాల వ్యూహబంధమూ బలపడుతుంది. రక్షణ రంగంలో ఫ్రాన్స్‌తో సహకారం ఈ ఏడాది మరింత ఇనుమడించింది. దీనితోపాటు హిందూ మహాసముద్రంలో భద్రతా పరమైన భాగస్వామ్యమూ బలపడింది. భారత్‌-ఫ్రాన్స్‌ సహకార వృద్ధి ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా విస్తృత ప్రభావం ప్రసరిస్తుంది. వేగంగా మారిపోతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా భారత్‌ ప్రధాన శక్తిగా ఎదుగుతోంది. అమెరికా, సోవియట్‌ ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అమెరికా నాయకత్వంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడినా, నేడు చైనా నుంచి ఎదురవుతున్న సవాలు వల్ల అది కూడా కనుమరుగవుతోంది. ప్రపంచం క్రమంగా బహుళ ధ్రువత్వం వైపు పురోగమిస్తోంది. ఆసియా కేంద్రిత బహుళ ధ్రువ ప్రపంచమది. ఈ వేదికపై ప్రధాన పాత్రధారిగా ఎదగడమే లక్ష్యంగా భారత్‌ విధాన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తోంది.

న్యాయపోరాటంలో విజయం

ప్రపంచశక్తిగా ప్రత్యేక ముద్ర
పాకిస్థాన్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ ఉరిశిక్ష నిలుపుచేసేలా అంతర్జాతీయ న్యాయస్థానంలో సానుకూల తీర్పు రాబట్టడం- ఈ ఏడాది భారత్‌ సాధించిన ఘన విజయాల్లో ఒకటి. 49 ఏళ్ల కుల్‌భూషణ్‌ తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారంటూ 2016లో పాకిస్థాన్‌ సైనికులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పాక్‌ సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో ఆయనకు మరణశిక్ష విధించింది. గూఢచర్యానికి, ఉగ్రవాదానికి పాల్పడ్డారనే అభియోగాలను ఆయన మీద మోపింది. ఇందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్‌ అదే సంవత్సరం మే ఎనిమిదిన అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కుల్‌భూషణ్‌ అసలు పాకిస్థాన్‌కే వెళ్ళలేదని,    ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న ఆయనను పాకిస్థాన్‌ అపహరించిందని ఆరోపించింది. ఈ కేసులో 2019 జులై 17న అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. పాక్‌ విధించిన ఉరిశిక్షను నిలుపుదల చేసింది. తీర్పును పునస్సమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పారు. దీంతో అంతర్జాతీయ వేదికపై పాక్‌కు చుక్కెదురైంది. కుల్‌భూషణ్‌ అరెస్టు, అనంతర విచారణల్లో పాకిస్థాన్‌ అన్యాయంగా వ్యవహరించిందని, భారత రాయబారులు ఆయనను కలవకుండా పదేపదే నిలువరించిందని అంతర్జాతీయ న్యాయస్థానం తప్పుపట్టింది.

నిజాం నిధుల కేసులోనూ గెలుపు

ప్రపంచశక్తిగా ప్రత్యేక ముద్ర
నిజాం నిధుల కేసులోనూ ఈ ఏడాది పాకిస్థాన్‌కు బ్రిటన్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంకులో ఈ నిధులున్నాయి. 1948లో అప్పటి నిజాం ఆర్థిక, విదేశాంగ మంత్రి మొయిన్‌ నవాజ్‌ జంగ్‌- కొత్తగా ఏర్పాటైన పాకిస్థాన్‌ తరఫున బ్రిటన్‌లో హైకమిషనర్‌గా ఉన్న హబీబ్‌ ఇబ్రహీం రహీంతుల్లా ఖాతాలోకి రూ.8.82 కోట్లకు పైగా సొమ్మును బదలాయించారు. అనంతరం ఈ సొమ్మును తిరిగి ఇచ్చేందుకు పాక్‌ నిరాకరించడంతో- 1954లో ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ బ్రిటన్‌ న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ నిధుల విలువ రూ.306.50 కోట్లు. నిజాం వారసులు ప్రిన్స్‌ ముఖర్రం జా, ఆయన సోదరుడు ముఖఫం జా, భారత ప్రభుత్వంతో కలిసి న్యాయపోరాటాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో తీర్పు భారత్‌కు అనుకూలంగా వచ్చింది. ఆ ఖాతాలో జమ అయిన నిధులు ఆయుధాల సరఫరాకోసం చేసిన చెల్లింపులేనని, అవి తమకే చెందుతాయని పాక్‌ చేస్తున్న వాదనలను బ్రిటన్‌ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ ఏడాది అక్టోబరులో వెలువరించిన తీర్పులో బ్యాంకు ఖాతాలోకి బదిలీ అయిన డబ్బుకు, ఆయుధాల సరఫరాకు సంబంధం ఉన్నట్లు సాక్ష్యాలేవీ లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆరున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసులో బ్రిటన్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో కీలకమైంది.

- అశోక ముఖర్జీ
(రచయిత- ఐక్యరాజ్య సమితిలో మాజీ భారత రాయబారి)

No comments:

Post a Comment