Thursday, August 22, 2019

ఏ భవితవ్యం కాచుకున్నది మన పిల్లల కోసం?

ఏ భవితవ్యం కాచుకున్నది మన పిల్లల కోసం?
22-08-2019 00:40:02

ప్రపంచాన్ని మెరుగుపరచాలని, సమాజాన్ని మానవీయంగా మలచాలని, సమత్వం, మమత్వం వెల్లివిరిసే లోకాన్ని తీర్చిదిద్దాలని వందల ఏళ్ల నుంచి మంచి మనుషులు చేస్తున్న ప్రయత్నాలు, కంటున్న స్వప్నాలు కుప్పగూలేట్లుగా చీకటి ముసురుతున్నది. కలలలో పడి ఆదమరచినందుకో, స్వార్థాలేవో ఆవరించినందుకో, వెలుతురు శక్తులు వెలిసిపోతున్నాయి. చరిత్ర ముగిసిపోదు కానీ, మంచి మనిషి అలసిపోడు కానీ, ఓడిపోతున్నప్పుడు దుఃఖించడమే మానవత్వం. ఒక చరిత్రకు చరిత్రే కూలిపోతున్నప్పుడు గుండెలు బాదుకోవడమే న్యాయం. తప్పేమీ లేదు. కుమిలిపోవాలి. తరువాతి తరాల మనుగడ తలచుకుని భయకంపితులం కావాలి.

ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో ఇరవై రోజుల కిందట ఒకానొక మిత్రుడు పోస్ట్‌ చేశాడు, ‘‘ఫ్లాష్‌ ఫ్లాష్‌, ఊపా బిల్లు 147–42 ఓట్లతో రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ చట్టం ఈ దేశంలో ఉంటూ పక్కదేశాల పాట పాడే దేశద్రోహులకు ఉద్దేశించింది, పార్లమెంటులో బిల్లు పాస్‌ అయినందుకు మోదీకి అభినందనలు, సైనికులపై రాళ్లు వేస్తే సక్కగ పైకి పంపుడే, అనుమానం వస్తే ఇక ఉగ్రవాదే, బుల్లెట్‌ దించుడే’’.. ఇట్లా సాగింది ఆ పోస్టు. ఆ పోస్టు పెట్టిన వ్యక్తి కేంద్రంలో అధికారపార్టీ సభ్యుడో సానుభూతిపరుడో కాదు. అతని వంటి వాళ్లు, ఈ ఆగస్టు నెలంతా సమస్త సామాజిక మాధ్యమాలలో కోకొల్లలుగా దేశభక్తి పారవశ్యంతో ఊగిపోతూ తారసపడుతున్నారు. వాళ్లు మొన్నా అటుమొన్నా ఎన్నికల సమయాల్లో ఐటీనిపుణులు సృష్టించిన యాంత్రిక ఐడీలు కారు. రక్తమాంసాలున్న మనుషులు.

అదే మరి సమస్య. మనుషులు అట్లా మారిపోయారు. సమ్మతి తయారీ జరిగిపోయి, అందరూ ప్రభుత్వ భక్తులైపోయి, అదే దేశభక్తి అని నమ్మేస్తున్నారు. కొరడాదెబ్బలను ప్రేమగా భరించగలిగే ప్రజలున్నప్పుడు, ఆ రాజుకు ఎదురేమిటి, ఆ రాజ్యానికి బెదురేమిటి?

టాడా, పోటా వంటి చట్టాలు వచ్చినప్పుడు వచ్చిన వ్యతిరేకతలు, తరువాత, వాటిని తొలగించడమే ఒక ఎన్నికల వాగ్దానంగా మారిన సందర్భాలు– అన్నీ గుర్తున్న వారికి, ఊపా సవరణ బిల్లు రాజ్యసభలో కూడా అవలీలగా ఆమోదం పొందడం ఆశ్చర్యమే కలిగించింది. ఒకళ్లో ఇద్దరో మినహా గట్టిగా మాట్లాడిన వారే లేరు. సంస్థలను ఉగ్రవాదసంస్థలుగా పరిగణించి, అందులో పనిచేసేవారిపై చర్యలు తీసుకోవడం ఉన్నది కానీ, ఈ సవరణ ద్వారా వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా అధికారికంగా పరిగణించడం సాధ్యపడుతుంది. ఇటువంటి బిల్లు ఎంతగా దుర్వినియోగమయ్యే అవకాశమున్నదో గతానుభవాల వల్ల తెలిసిన వారు, సహజంగానే ఈ సవరణ బిల్లును చూసి భయకంపితులవుతారు. హక్కుల ఉద్యమకారులు ఆందోళన చెందుతారు. కానీ, అణగారిపోయి ఉన్న పౌరసమాజం, బలహీనంగా మూలిగింది తప్ప, గొంతెత్త లేకపోయింది. సర్వవిధాల భ్రష్ఠుపట్టిపోయిన ప్రతిపక్షాలు డొంకతిరుగుడు మౌనాన్ని ఆశ్రయించాయి. విచక్షణ నీరసించడం వల్ల ఉద్రేకభావాలు విజృంభిస్తున్నాయా? వాటి విజృంభణ వల్లనే వివేకం నీరసిస్తున్నదా?

ఇక 370 అధికరణాన్ని నిస్సారం చేసిన తరువాత, కశ్మీర్‌లోయలో పూర్తి నిశ్శబ్దాన్ని విధించిన తరువాత, అమాయక దేశభక్తుల ఉద్వేగాలు తారస్థాయికి చేరాయి. మరో మిత్రుడు మరో గ్రూప్‌లో ఏమి కోరాడంటే, కశ్మీర్‌లో పరిస్థితుల గురించి ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యానాలు కనిపించినా, వినిపించినా, 370 ఆర్టికల్‌పై రాష్ట్రపతి చర్యను ఏ మాధ్యమంలో వ్యతిరేకించినా ఎన్‌ఐఎకు ఫిర్యాదు చేయాలి. అందుకోసం ఎన్‌ఐఎ వెబ్‌సైట్‌ అడ్రస్‌ను కూడా ఇచ్చారు. తాను చేస్తున్నది సరైనదే అని ఆ మిత్రుడు కూడా నమ్మి ఉంటాడు. పత్రికలు ఏమి చేయాలో చేయకూడదో తామే నిర్ణయించవచ్చునని, చేయకూడనివి చేస్తే ప్రెస్‌కౌన్సిల్‌ వంటి వాటిని కాక ఎన్‌ఐఎనో పోలీసులనో ఆశ్రయించాలని పౌరులే నమ్ముతుంటే పత్రికాస్వేచ్ఛ విషయంలో ఏలినవారు తగిన చర్య తీసుకోవడానికి ఆటంకమేముంటుంది? ఒక నిర్బంధాన్ని, ఒక ఏకఛత్రాధిపత్యాన్ని ప్రజలే కోరుకుంటున్నప్పుడు, ఆ కోరుకోవడానికి అనువైన సమ్మతిని మీడియాతో సహా సమస్త భావ ప్రపంచమూ ఎంతో తన్మయంతో తయారు చేస్తున్నప్పుడు, –పనికిమాలిన ఎరుకతో, బతకనేర్వలేని ఆత్మలతో కొందరు భయపడుతున్న రోజులు ఎంతో దూరం లేవు.

ఇప్పటి ప్రభుత్వమైనా ఘనత వహించిన గత ప్రభుత్వాలైనా, రాజ్యాంగాన్ని సవరిస్తున్నప్పుడు, కొత్త చట్టాలు చేస్తున్నప్పుడు, తమ సంకల్పానికి ఏవో ఉత్తమాదర్శాలనో, ఏవో భయాందోళనలనో కారణాలుగా చెబుతాయి. కానీ, సమాజం ఆ కారణాలను నమ్మదు. నమ్మకూడదు కూడా. నువ్వు చూపుతున్న కారణాలకే కాదు, నువ్వు మరెందుకో కూడా ఈ శాసనాలను ఉపయోగిస్తావు, నీ రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తావు. ఉగ్రవాదుల మీదనే కాదు, ప్రజాస్వామ్యం కోరుకునే వారి మీద కూడా గురిపెడతావు– అన్న విమర్శ రావాలి. హింసను హింసావకాశాలను అదుపు చేయాలంటే, చట్టంలో అనేక మార్గాలున్నాయి, కొత్త కోరలతో శాసనాలను ముస్తాబు చేయనక్కరలేదని చెప్పాలి. కానీ, సంకెళ్లను ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు, అవి మన కోసమేనన్న తెలివిడి ఉండదు. ఉద్వేగం అవధులు మీరినప్పుడు ఆలోచన అణగారిపోతుంది. సులువైన నిర్వచనాలతో దేశభక్తి, జాతీయతలు విశ్వాసాలుగా మారిపోతాయి. తిరుగులేని మెజారిటీలతో, చెవులు పిక్కటిల్లే జయజయధ్వానాలతో, గుండెలు బాదుకునే పూనకాలతో సమ్మతిని సాధించుకున్న నాయకులు, ఆ బలాఢ్యతను, జనాదరణను దేనికి ఉపయోగిస్తారో తెలియదా?

పాలకుల దుర్మార్గాలో, వారి నియంతృత్వ పోకడలో– ఇవి కాదు ఇప్పుడు ప్రమాదం. ఏలికలు తలపెట్టినదానికి గుడ్డిగా జేజేలు కొట్టే ప్రజలే నిజమైన ప్రమాదం. మంచి చెడ్డల విచక్షణ లేకుండా మనుషులలో తయారైన సమ్మతి, దీర్ఘకాలం సమాజాన్ని బాధిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాధినేతలు రేపు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనలో జీర్ణించుకుపోయిన విచక్షణరాహిత్యం మనల్ని చాలా కాలం పాలిస్తూనే ఉంటుంది. స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అక్కరలేదనుకునే జాతి, నిర్బంధంలోనే పరవశించిపోయే ఖైదీలు, అంటరాని వాడినని తానే చెప్పుకుని దూరం జరిగే దళితుడు, పురుషుని లోదుస్తులు ఉతకడంలోనే సార్థకతను వెదుక్కునే స్త్రీ, పాలకుని సాహసక్రౌర్యాన్ని చూసి ఈలలు వేసే యువకులు, అంతా తలరాత అని సరిపెట్టుకునే నిరుపేదలు, అగ్రరాజ్యపు ఉక్కుపాదాన్ని ముద్దాడే బడుగు దేశాలు– అంతా ఇలా ఉన్నప్పుడు ప్రపంచంలో హింసకు ఆస్కారమే ఉండదు. అశాంతికి అవకాశమే ఉండదు. అటువంటి వారిని రూపొందించే పెద్ద ప్రాజెక్టు ఏదో తయారీలో ఉన్నది.

ఆలోచనా విధానంలో ఈ ఉధృత పోకడలున్నవారు మిత్రులే. మన పొరుగువారే. బంధువులే. మన పిల్లలే. మరో గ్రహం నుంచో, పరదేశం నుంచో రాలేదు. మన కళ్లెదురుగానే వాళ్లు అట్లా తయారవుతున్నారు. ప్రపంచాన్ని మెరుగుపరచాలని, సమాజాన్ని మానవీయంగా మలచాలని, సమత్వం, మమత్వం వెల్లివిరిసే లోకాన్ని తీర్చిదిద్దాలని వందల ఏళ్ల నుంచి మంచి మనుషులు చేస్తున్న ప్రయత్నాలు, కంటున్న స్వప్నాలు కుప్పగూలేట్లుగా చీకటి ముసురుతున్నది. కలలలో పడి ఆదమరచినందుకో, స్వార్థాలేవో ఆవరించినందుకో, వెలుతురు శక్తులు వెలిసిపోతున్నాయి. చరిత్ర ముగిసిపోదు కానీ, మంచి మనిషి అలసిపోడు కానీ, ఓడిపోతున్నప్పుడు దుఃఖించడమే మానవత్వం. ఒక చరిత్రకు చరిత్రే కూలిపోతున్నప్పుడు గుండెలు బాదుకోవడమే న్యాయం. తప్పేమీ లేదు. కుమిలిపోవాలి. తరువాతి తరాల మనుగడ తలచుకుని భయకంపితులం కావాలి.

చీకటి శక్తులకు గతంలో ఒక పేరు పెట్టి, ఒక మూసలో గమనిస్తుండేవాళ్లము. ప్రతీపశక్తులో, ప్రతీఘాత శక్తులో, తిరోగమనవాదులో, జాతిహనన వాదులో, చివరికి ఫాసిస్టులో– ఏదో ఒకటి. కానీ, వాళ్లు నొసటి మీద తమ పేర్లు రాసుకుని ఉండరు. కోరకి కన్నూ, కొమ్ముకి కన్నూ, కర్కాటక కర్కోటకులో– అన్నట్టు ఏమీ ఉండరు. బూచాళ్లలాగా ఉండరు. భూమి దద్దరిల్లేటట్టు ఏమీ నడవరు. మన మధ్యలోంచే మనలోనుంచే మొలుస్తారు. మనల్ని హ్యాక్‌ చేసి మనలోపలికి దూరతారు.

మైకెల్‌ రోసెన్‌ అనే ఇంగ్లీషు కవి, పిల్లల రచయిత రాసిన ఒక పద్యం ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో బాగా సంచరించింది. ‘ఫాసిజం: సమ్‌ టైమ్స్‌ ఐ ఫియర్‌’ – అన్న ఆ పోయెం ఇట్లా హెచ్చరిస్తుంది. ‘‘నాటకాల్లో దయ్యాల్లాగా వికృత వేషాలతో రాదు ఫాసిజం

నీ స్నేహితుడిలా వస్తుంది
నీ పరువును నిలబెడుతుంది
నువు గర్వపడేట్టు చేస్తుంది
నీకు ఉద్యోగం ఇస్తుంది
నీ వీధుల్ని శుభ్రం చేస్తుంది
నువ్వొకప్పుడు ఎంత గొప్పవాడివో గుర్తుచేస్తుంది
అవినీతిని అక్రమాల్నీ తుడిచిపెట్టేస్తుంది
నీలాగా లేనిది ఏదైనా దాన్ని తీసిపారేస్తుంది
హత్యలు చేస్తాం, జైళ్లలో పెడతాం, యుద్ధాలు చేస్తాం,
ఊచకోతలు కోస్తాం అంటూ ఫాసిజం అరుచుకుంటూ రాదు’’
కె. శ్రీనివాస్

No comments:

Post a Comment