Thursday, January 11, 2024

Vikasit Bharat

 భారత్‌ వికసిస్తోందా... ఏదీ, ఎక్కడ?

ABN , Publish Date - Jan 10 , 2024 | 02:35 AM


నరేంద్రమోదీ ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ పేరున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. ఈ పదేళ్ల పాలనలో మోదీ సర్కార్‌ సాధించిన విజయాలను ప్రజల్లో ప్రచారం చేయడం...


భారత్‌ వికసిస్తోందా... ఏదీ, ఎక్కడ?

నరేంద్రమోదీ ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ పేరున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. ఈ పదేళ్ల పాలనలో మోదీ సర్కార్‌ సాధించిన విజయాలను ప్రజల్లో ప్రచారం చేయడం ఈ యాత్ర ముఖ్యోద్దేశం. కేంద్ర మంత్రులు అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ పాలనలో దేశం సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తున్నారు. దేశ జీడీపీ (స్థూల జాతీయ ఉత్పత్తి) 7 శాతానికి పైగా వృద్ధి రేటుతో దూసుకుపోతోందని, 2047 కల్లా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. ఆయన ప్రభుత్వం ఈ పదేళ్ల కాలంలో సాధించిందేమిటో పరిశీలిస్తే స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల (2047) నాటికి దేశం ఏ స్థితిలో ఉంటుందో స్పష్టంగా అవగతమవుతుంది.


జీడీపీ వృద్ధిరేటును ముందు సంవత్సరంతో పోల్చి ఈ సంవత్సరం ఎంత పెరిగిందో శాతంగా తెలుపుతారు. 2021లో కోవిడ్‌ సందర్భంగా మన జీడీపీ మైనస్‌ 5.8 శాతం నమోదయింది. దీనితో పోల్చి 2022, 2023లలో జీడీపీ వృద్ధిరేటు ఏడు శాతానికి పైగా చేరిందని ప్రభుత్వం లెక్క కట్టింది. వాస్తవంగా 2004–14 సంవత్సరాల మధ్య పదేళ్ల కాలంలో జీడీపీ వృద్ధిరేటు సగటున 8.1శాతంగా ఉంది. అదే నరేంద్ర మోదీ ప్రభుత్వ కాలంలో అది 5.4శాతం మాత్రమే. పోనీ వీరు చెబుతున్నట్లు సాధించిన అభివృద్ధి సామాన్యుల వద్దకు చేరుతోందా? ఆర్థిక అసమానతలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రభాగాన ఉందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక పేర్కొంది. ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ గత పదేళ్ళ కాలంలో భారతదేశంలోని సంపన్నుల ఆదాయం పదిరెట్లు పెరిగిందని, వారి వార్షికాదాయం నేడు భారతదేశ బడ్జెట్‌ కంటే అధికమని తెలిపింది. జనాభాలో ఒక్క శాతంగా ఉన్న సంపన్నులకు దేశ ఆదాయంలో 73 శాతం పోతుండగా, 67 కోట్ల మంది సామాన్యుల ఆదాయం మాత్రం ఒక్క శాతమే పెరిగింది. వైద్య ఖర్చులకై అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవడం ద్వారా దేశంలో ప్రతి ఏటా 6.3 కోట్ల మంది ప్రజలు దారిద్రంలోకి నెట్టబడుతున్నారని ఈ సంస్థ పేర్కొంది.


కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న వృద్ధిరేటు... ఉపాధి అవకాశాలు కల్పిస్తోందా అంటే అవీ సన్నగిల్లుతున్నాయి. మోదీ మహాశయుడు ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల హామీ గాలికి పోయింది. నిరుద్యోగిత రేటు పది శాతానికి చేరింది. ఇప్పటికే కులం, ప్రాంతం, మతం, జెండర్‌ అసమానతలతో ఉన్న భారతదేశంలో నేడు ఆర్థిక అసమానతలు కూడా చేరడం ఆందోళనకరంగా ఉందని ప్రొఫెసర్‌ హిమాన్షు (జేఎన్‌యూ) అన్నారు. పోనీ ప్రజల జీవన ప్రమాణాలయినా మెరుగుపడ్డాయా అంటే, దానికి భిన్నంగా పేదరికం పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఆర్భాటంగా ప్రారంభించిన జన్‌ధన్‌ అకౌంట్లలో డబ్బులే లేవు. పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. నిత్యావసర సరుకులన్నీ విపరీతంగా పెరిగాయి. విద్య, వైద్యం విలాస వస్తువులుగా మారిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ప్రజలు పెద్ద ఎత్తున పేదరికంలోకి నెట్టబడుతున్నారు. 74.1 శాతం భారతదేశ పౌరులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక తెలిపింది. జీడీపీ వృద్ధిరేటు సాధించడంలో విశేషమైన పాత్ర పోషిస్తున్న కార్మికులు, రైతుల జీవన ప్రమాణాలైనా మెరుగుపడ్డాయా అంటే అదీ లేదు.


అతి పెద్ద రైల్వే సహా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ నియామకాలను కేంద్ర ప్రభుత్వం దాదాపు నిలిపివేసింది. ఎటువంటి ఉద్యోగ భద్రత లేని, అత్యంత తక్కువ వేతనాలకు ఈ రోజున కార్మికులు పనిచేయవలసి వస్తోంది. కొత్తగా వస్తున్న ఉపాధి కూడా కాంట్రాక్టు, అసంఘటిత రంగాల్లోనే. వీరికి అత్యధికంగా నెలకు పదిహేను వేలకు మించి ఆదాయమే ఉండటం లేదు. మహిళాభివృద్ధి, బేటీ పడావో అని గొప్ప నినాదాలిస్తున్న మోదీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ, ఆశ, మిడ్‌ డే మీల్స్‌ వంటి రంగాల్లో పనిచేస్తున్న సుమారు కోటి మందికి పైగా మహిళా కార్మికులకు ఉద్యోగ భద్రత లేకపోవడమే కాక, వేతనాలు కూడా అత్యంత తక్కువ. పేదలకు పోషకాహారం, మహిళా, శిశు సంరక్షణ వంటి ముఖ్యమైన అనేక సేవలందిస్తున్న ఈ స్కీం వర్కర్ల సమస్యలు ఎంతగా ఉన్నాయంటే ఆఖరుకు ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ కూడా వీరి సమస్యల పరిష్కారానికై ఆందోళన చేయవలసి వచ్చింది.


ఎన్డీఏ మొదటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్‌ విధానం ఉద్యోగుల పొదుపు సొమ్మును కొంతమంది కార్పొరేట్లు కొల్లగొట్టుకుపోయేలా తయారైంది. దీనిని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఇది చాలదన్నట్లు కార్మికులకు కొంతైనా మేలు కలిగే 27 కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటి స్థానంలో సంఘం పెట్టుకోవడం, సమ్మె చేయడం వంటి హక్కులను సైతం హరించే కార్మిక వ్యతిరేక అంశాలతో నాలుగు లేబర్‌ కోడ్‌లను మోదీ ప్రభుత్వం చేసింది. మరోపక్క వ్యవసాయరంగంలో పూర్తి రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోంది. కార్పొరేట్‌ సేద్యాన్ని ప్రోత్సహించేలా నల్ల చట్టాలను చేసి, అన్నదాతలు సంవత్సరం పైగా పెద్ద ఎత్తున పోరాడిన దరిమిలా వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా ఆచరణలో అవే కార్పొరేట్‌ అనుకూల విధానాలను కేంద్రం కొనసాగిస్తోంది.


మోదీ ప్రభుత్వ కాలంలో శ్రామిక మహిళలతో పాటు సాధారణ మహిళలు కూడా పెద్ద ఎత్తున వివక్షకు గురవుతున్నారు. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం గత ఏడాది దేశంలో 62,946 మంది బాలికలు కనిపించకుండా పోయారు. వీరిలో అత్యధికులు వేశ్యాగృహాలపాలయ్యారు. ఇవన్నీ అధికారికంగా నమోదైన లెక్కలు. వాస్తవంలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఒడిషా రాష్ట్రంలోని సుందర్‌ఘర్‌ ప్రాంతంలో సర్వే నిర్వహించిన ప్రగతి అనే స్వచ్ఛంద సంస్థ 70 గ్రామాలలో పదమూడు వేలమంది అమ్మాయిలు కనపడలేదని తెలిపింది.


నేడు దేశం వికసిత భారత్‌గా కాక, అత్యధిక ప్రజానీకాన్ని అభివృద్ధి ఫలాల నుండి గెంటివేసే భారత్‌గా రూపాంతరం చెందుతోంది. ఇది ఇలాగే కొనసాగితే 2047 కల్లా దేశం ఎలా ఉంటుందన్నది ఊహించుకుంటేనే ఆందోళన కలుగుతుంది. ప్రధాని మోదీ పదేళ్ళ పాలనలో అసమానతలు మరింత పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయన్నది వాస్తవం. భావోద్వేగాలు రెచ్చగొట్టి కొంతకాలం పబ్బం గడుపుకోగలరేమో గానీ, ఎల్లవేళలా అశేష ప్రజానీకాన్ని మోసపుచ్చలేరు.


ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

No comments:

Post a Comment