Monday, September 4, 2023

The Parliamentary corruption at its peak

 పరాకాష్ఠలో పార్లమెంటరీ భ్రష్టత్వం

ABN , First Publish Date - 2023-07-26T01:35:49+05:30 IST

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తనను తాను అంతం చేసుకుంటున్నదా? ఈ విషయమై అనుమానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్లమెంట్ బయట ఎన్నికల రాజకీయాలు ఎలాగూ...

పరాకాష్ఠలో పార్లమెంటరీ భ్రష్టత్వం

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తనను తాను అంతం చేసుకుంటున్నదా? ఈ విషయమై అనుమానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్లమెంట్ బయట ఎన్నికల రాజకీయాలు ఎలాగూ ప్రహసనప్రాయమయ్యాయి. వేల కోట్లతో ఓట్లు కొనుక్కోవడాలు, ఉచిత తాయిలాలు, కుల, మత భావోద్వేగాలను దట్టించడం మూలాన అసలు ఎన్నికయిన ప్రజాప్రతినిధులు సరైన వారేనా అన్న అనుమానం మొదటి దశలోనే కలుగుతుంది. ఇక ఎన్నికైన తర్వాత వారు తాము గెలిచిన పార్టీలో ఉంటారా లేదా అన్న అనుమానాలకు కూడా అనేక సంఘటనలు ఆస్కారం కలిగిస్తున్నాయి. పోనీ కనీసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్లమెంట్, చట్టసభలను సవ్యంగా నడిపిస్తారా అంటే అదీ చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. మన పార్లమెంటరీ వ్యవస్థలో పెచ్చరిల్లుతున్న దుష్పరిణామాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతం పలుకుతారని తొమ్మిది సంవత్సరాలకు ముందు ఆశించిన వారు ఎందరో ఉన్నారు. అసలు మోదీకే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సవ్యంగా సాగడం ఇష్టం లేదా అన్న అనుమానాలకు వారందరూ ఇప్పుడు గురవుతున్నారు.


పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గత నాలుగు రోజులుగా స్తంభించిపోతున్నాయి. కారణమేమిటో మరి చెప్పాలా? మణిపూర్‌లో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న దారుణ మారణకాండపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉభయ సభల్లో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడమే. పార్లమెంట్ సరిగ్గా సాగాలనే సదుద్దేశం ఉంటే మోదీ మొదటి రోజే మణిపూర్ గురించి సభలోనే ప్రకటన చేసి ఇలాంటి తీవ్రమైన అంశంపై అన్ని పక్షాలూ పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని అభ్యర్థించేవారు. 2001లో మణిపూర్‌లో ఇలాంటి కల్లోలమే సంభవించినప్పుడు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి రెండుసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించారని, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాల్సిందిగా మణిపూర్ ప్రజలను అభ్యర్థించారని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు మీడియాతో మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలపై జరిగిన అత్యాచారాన్ని ఖండించారు. అయితే ఆ రాష్ట్రంలో జాతుల ఘర్షణ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారో చెప్పలేదు. నిజానికి ఇద్దరు మణిపూర్ మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన సంఘటన వెలుగులోకి రాకపోతే ప్రధాని నోరు విప్పేవారు కాదని మణిపూర్‌లో స్థానిక బిజెపి ఎమ్మెల్యే పాలోయిన్ లాల్ హోకిప్ అన్నారు. ‘79 రోజులుగా ఘోరాలు జరుగుతున్నా మోదీ నోరు విప్పలేదు. ఇలాంటి ఘటనలను ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవారు ఒక్కసారైనా ఖండించకపోయినా దారుణమే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులుగా తాము అక్కడ జరుగుతున్న దారుణాలను గురించి వివరించేందుకు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కోరామని, కాని ఆయన ప్రాధాన్యాలు వేరని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అంతా చూస్తుంటే మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగే హంతక ముఠాలతో కుమ్మక్కైనట్లు కనపడుతోందని, ఒక జాతి జాతినే నిర్మూలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన అన్నారు 17వ లోక్‌సభ 1952 తర్వాత అతి తక్కువ రోజులు సమావేశం అయిన చట్టసభగా చరిత్ర పుటల్లో రికార్డు కానున్నదని పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసర్చ్ ఇప్పటికే వెల్లడించింది. ఇప్పటి వరకూ కేవలం 230 రోజులే సభ సమావేశమైంది. అంటే ఏడాదికి 58 రోజులు మాత్రమే పార్లమెంట్ సమావేశమవుతోంది, ప్రస్తుత పార్లమెంట్ జరుగుతున్న తీరు చూస్తుంటే మున్ముందు కూడా సభ సవ్యంగా జరిగే అవకాశాలు కనపడడం లేదు. ప్రభుత్వ వైఖరి మూలంగా ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా సవ్యంగా సాగలేదు. లోక్‌సభ 34 శాతం, రాజ్యసభ 24 శాతం మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాయి. అసలు ఎటువంటి చర్చ లేకుండానే బడ్జెట్‌ను ఆమోదించారు. అయిదు మంత్రిత్వ శాఖలకు సంబంధించి రూ.11 లక్షల కోట్ల వ్యయం, వివిధ మంత్రిత్వ శాఖల రూ.42 లక్షల కోట్ల వ్యయం ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదం పొందాయి. రెండో విడత బడ్జెట్ సెషన్ కార్యకలాపాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. చివరిలో ఉభయ సభల సభాపతులు ఆనవాయితీగా ఏర్పాటు చేసే తేనేటి విందును కూడా ప్రతిపక్ష నేతలు బహిష్కరించారంటే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎంత తీవ్ర అగాధం ఏర్పడిందో అర్థమవుతుంది. ఇదే సెషన్ చివరిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించడం, ఆయనను పార్లమెంట్ నుంచి బహిష్కరించడం, ఇల్లు ఖాళీ చేయమని నోటీసు పంపడం వెంటవెంటనే జరిగిపోయాయి 2022 శీతాకాల సమావేశాలు కూడా ఉభయ సభలు షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందే నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంతకు ముందు వర్షాకాల సమావేశాల్లో ఒకేసారి 24 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేసి నాలుగురోజుల ముందే వాయిదా వేశారు. మొదటి రెండు వారాలు ఉభయ సభల్లో ఏ చర్చా జరగలేదు. చివరకు సస్పెన్షన్లను ఎత్తి వేసి ధరల పెరుగుదలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.



సాధారణంగా ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాల సమయంలో ఏమి డిమాండ్ చేస్తాయి? ఆ సమయంలో దేశంలో జరిగిన ఒక ముఖ్యమైన ఘటనపై చర్చ జరగాలనో, పార్లమెంటరీ కమిటీనో డిమాండ్ చేస్తాయి. అదానీపై హిండెన్ బర్గ్ నివేదిక వచ్చినప్పుడు సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని అడగడం సహజం. గతంలో ఇలాంటి కుంభకోణాలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నేతలూ ఇదే విధంగా డిమాండ్ చేశారు కదా! అదే విధంగా మణిపూర్ లాంటి ఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి సభలో మాట్లాడాలని డిమాండ్ చేయడం కూడా సముచితమే. ఇలాంటి వాటిని ముందే ఊహించి ప్రతిపక్షాలతో మాట్లాడి, పరిష్కార మార్గాలు కనుక్కుని సభ సవ్యంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాని ప్రభుత్వమే సంఘర్షణాయుత వైఖరిని అవలంబిస్తే ఎవరేమి చేయగలరు? మణిపూర్‌పై ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా మోదీ మాత్రం సభలో మాట్లాడకూడదని, గందరగోళంలోనే బిల్లులు ఆమోదించాలని బిజెపి వ్యూహకర్తలు ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. రాజుకంటే మొండివాడు బలవంతుడని అంటారు. కాని రాజే మొండివాడైతే ఏం చేయగలం?


ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించడాన్ని మోదీ సర్కార్ ఏనాడో మరచిపోయింది. ఇప్పుడు కనీసం చర్చలకు కూడా అవకాశం కల్పించకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. పార్లమెంటరీ సంయుక్త కమిటీ మాట పక్కన పెడితే కీలకమైన బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు నివేదించే పద్ధతిని కూడా మోదీ ప్రభుత్వం విస్మరించినట్లు కనపడుతోంది. మోదీ హయాంలో 16వ లోక్‌సభలో కేవలం 25 శాతం బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదిస్తే, ప్రస్తుత 17వ లోక్‌సభలో 15 శాతం బిల్లులను కూడా నివేదించలేదని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ లోక్‌సభలో ఇంతవరకు కేవలం 14 బిల్లులను మాత్రమే కమిటీలకు పంపారు. అంతకు ముందు 60 నుంచి 70 శాతానికి పైగా బిల్లులను పార్లమెంట్‌లో స్థాయీ సంఘాలే చర్చించి సభ ఆమోదానికి పంపేవి. స్థాయీ సంఘాలకు విలువ లేకపోవడం వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపగలుగుతాయో, ప్రభుత్వ నిధులు పూర్తిగా ఖర్చవుతున్నాయో లేదో సమీక్షించే అవకాశం కూడా లేకపోయింది. వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును చర్చించే సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టారు.


రాజ్యాంగంలోని 93వ అధికరణ ప్రకారం లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ను నియమించాల్సి ఉన్నది. 17వ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ లేకుండానే అంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన సమస్యలు తలెత్తినప్పుడు అన్ని విషయాలను పక్కన పెట్టి చర్చించేందుకు వీలు కల్పించే లోక్‌సభలో వాయిదా తీర్మానాల క్రింద కానీ రాజ్యసభలో 267వ నిబంధన క్రింద కానీ ఇచ్చిన నోటీసులను పూర్తిగా పక్కన పెడుతున్నారు.


2014లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయిన రోజు పార్లమెంట్ ద్వారం ముందు మోకరిల్లి సభలో అడుగుపెట్టిన మోదీ ఇటీవల నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం సందర్భంగా రాజదండంతో ప్రవేశించారు. అయితే ఈ తొమ్మిదేళ్లలో పార్లమెంట్ సమావేశాల విషయంలో ఆయన వ్యవహరించిన వైఖరికీ, ఆయన ప్రదర్శించిన దృశ్యాలకూ ఎంతో వ్యత్యాసం కనపడుతున్నది. దేశంలోనే కాదు, వివిధ దేశాల్లో పర్యటిస్తూ అనేక ప్రసంగాలు చేసే మోదీ కీలకమైన అంశాలపై కనీసం పార్లమెంట్‌లో కూడా ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు? తొమ్మిది సంవత్సరాలుగా విలేఖరుల సమావేశం పెట్టకపోయినా పర్వాలేదేమో కాని ఒక దేశాధినేతగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మౌనం పాటించడంలో ఆయన ఉద్దేశమేమిటి? పెద్ద నోట్ల రద్దు సమయంలో సామాన్య జనం మైళ్ల పొడవున క్యూల్లో నిల్చోవాల్సి వచ్చినా, కొవిడ్ మహమ్మారి సందర్భంగా వేలాది వలస కూలీలు దిక్కులేని చావులు చచ్చినా, ఏడాది పొడవునా సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రదర్శనల్లో వందలాది రైతులు మరణించినా, బిజెపి ఎంపియే తమను లైంగికంగా వేధించారని మహిళా ఛాంపియన్ మల్లయోధులు నెలల తరబడి నిరసన ప్రదర్శనలు నిర్వహించినా మోదీ మౌనం పాటించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మణిపూర్‌లో జరుగుతున్న కల్లోలం మరో ఎత్తు. జాతిపర ఊచకోతకు గురై దాదాపు 50వేల మందికి పైగా ఇంకా శరణార్థుల శిబిరాల్లో తలదాచుకున్నారు. వేలాది మంది మిజోరంకు పారిపోయారు ఈ దేశానికి ఒక నిర్ణయాత్మక నాయకత్వం అందించాల్సిన మోదీ ప్రధానమంత్రే కాదు పార్లమెంట్ నేత కూడా. పార్లమెంట్‌కు అవసరమైన సమాధానాలు చెప్పి, అది సవ్యంగా నడిచేలా చూసే బాధ్యత కూడా ఆయనదే.


ఎ. కృష్ణారావు


(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

No comments:

Post a Comment