Sunday, September 25, 2022

దేశ రక్షణ కోసం మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలి

 దేశ రక్షణ కోసం మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలి 

Sun 25 Sep 04:21:08.005457 2022

- దేశ రక్షణ భేరిలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి

అమరావతి : దేశాన్ని రక్షించుకోవాలంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందేనని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశరక్షణ భేరీలో భాగంగా విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లో శనివారం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఆర్థికదోపిడీ ఆపాలన్నా, రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజల హక్కులను కాపాడుకోవాలన్నా మోడీ సర్కారును గద్దెదించడమొక్కటే మార్గమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, అది పెంచి పోషిస్తున్న మతోన్మాదాన్ని వక్తలు విమర్శించినప్పుడు సభకు హాజరైన వారు పెద్దఎత్తున కరతాళధ్వనులు చేశారు. సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఏడేండ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం, పేదరికం, ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. దేశ వ్యాప్తంగా 42శాతం మంది నిరుద్యోగులు ఉన్నారనీ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని చెప్పారు. తినడానికి తిండికూడా లేని అభాగ్యుల సంఖ్య పెరుగుతోందన్నారు. అదే సమయంలో పెద్దపెద్ద పెట్టుబడిదారులకు 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రద్దు చేశారనీ, మరో రూ.2 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చారని తెలిపారు. ఇదంతా సాధారణ ప్రజల కష్టార్జితమేనని, వారు రూపాయి, రూపాయి కూడగట్టి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులేనని వివరించారు. కార్పొరేట్లు రుణాల తీసుకుని ఎగ్గొడుతున్నా మోడీ సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వాటిని వసూలు చేస్తే దేశం అన్ని రంగాల్లోనూ ముందుక వెళ్తుందని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఉండదని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా వదిలేసిన మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలు, రవాణా వ్యవస్థలను తెగనమ్ముతోందన్నారు. దేశంలో ఇప్పటికే ఉన్న, కొత్తగా పుట్టుకొచ్చిన ఐదుగురు మహా కోటీశ్వరులు గుజరాత్‌కు చెందిన వారేనని చెప్పారు. ఉపాధి హామీ పనులకు రూ.73 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేని కేంద్రం గుజరాత్‌కు చెందిన వేదాంతకు రూ.80 వేలకోట్ల మైనింగ్‌ సబ్సిడీ ఇచ్చిందని చెప్పారు. ఒకవైపు కార్పొరేట్లకు భారీ ఎత్తున లభ్ది చేకూరుస్తున్న మోడీ ప్రభుత్వం అందే సమయంలో ముస్లింలు, క్రిస్టియన్లపై దాడులు చేస్తూ లౌకికతత్వానికి తూట్లు పొడుస్తోందని వివరించారు. లైంగికదాడికి గురైన బిల్కిస్‌బానో కేసులో నేరస్తులను శిక్ష పూర్తికాకుండానే వదిలేసిందని, వారిని హీరోలుగా చిత్రీకరిస్తోందని అన్నారు. బీమా కోరేగావ్‌ కేసులో మేధావులు, రచయితలను జైల్లో కుక్కి నాలుగేళ్లవుతున్నా ఛార్జిషీటు దాఖలు చేయలేదని చెప్పారు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడి జరుగుతోందని, ప్రశ్నించిన వారిపైనా, ప్రతిపక్ష నాయకులపైనా సీబీఐ, ఇడి దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని తెలిపారు. కర్నాటక, గోవా, మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోయినా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, దీనివెనుక సీబీఐ, ఈడీ ఉన్నాయని తెలిపారు. మోడీ ప్రభుత్వ హయాంలో 11 వేలమంది యువకులు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మహిళలపై దాడులు 20 శాతం పెరిగాయని వివరించారు. దళితులపై దాడులకు అంతేలేదని వివరించారు. భూములు సాగుచేసుకుంటున్న దళితులు, మైనార్టీలను ఆ భూముల్లో నుండి తరిమేస్తూ వాటిని భూస్వాముల పరం చేస్తున్నారని తెలిపారు. మీడియా సంస్థలను భయపెట్టి ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారాలకు దిగుతోందని తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన దేశ భక్తులకు పోరాడే సమయం వచ్చిందని అన్నారు.

సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రం పట్ల వైసీపీ సానుకూల వైఖరి అనుసరిస్తోందన్నారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా మాట్లాడటం లేదన్నారు. విశాఖ ఉక్కును అమ్మేస్తుంటే కార్మికులే పోరాడుతున్నారని కడప ఉక్కు ఫ్యాక్టరీని ఇంతవరకు నిర్మించలేదని విమర్శించారు. పోలవరం పునరావాసం గురించి పట్టించుకోవడం లేదన్నారు. ముంపు లెక్కలు సక్రమంగా లేకపోవడంతో ప్రభుత్వం చెబుతున్న దానికన్నా ఎక్కువ ప్రాంతం నీట మునుగుతోందన్నారు.

పోలవరం ప్రాజెక్టు డిజైన్‌లో తప్పులున్నాయని చెబుతున్న ప్రభుత్వం ముంపు లెక్కలు సక్రమంగా ఉన్నట్లు భావిస్తోందని, ఇదెక్కడి పద్దతని ప్రశ్నించారు. పాత ముంపు లెక్కలను పక్కనబెట్టి కొత్తగా లెక్కలు తీయాలని డిమాండ్‌ చేశారు. పూర్తిస్థాయిలో ముంపు బాధితులను గుర్తించి, వారికి పరిహారం, పునరావాసం పూర్తి చేసిన తరువాతే పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగించాలన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ కేంద్ర కమిటీ షభ్యుల ఎం.ఏ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుబ్బరావమ్మ, సీనియర్‌ నాయకులు పి.మధు, గిరిజన నాయకులు మొడియం నాగమణి ప్రసంగించారు.



కేంద్రంలో బిజెపి అదేశాలు.. రాష్ట్రంలో జగన్‌ అమలు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

Sep 24,2022 16:44



విజయవాడ : రాష్ట్రంలో మోడీ రాజ్యం నడుస్తోందని.. కేంద్రంలో బిజెపి అదేశాలు ఇక్కడ జగన్‌ అమలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయవాడలో జరిగిన 'దేశ రక్షణ బేరి' బహిరంగ సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''రాష్ట్రంలో ఒక అడ్డగోలు ప్రభుత్వం నడుస్తుంది. చెత్త పన్ను వేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో వేస్తారు. డబ్బు లేకపోతే మోదీ జుట్టు పట్టుకుని రూ.36 వేల కోట్లు తీసుకురండి. వైసిపికి పార్లమెంట్లో సంఖ్య బలం వున్న కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారన్నారు. విశాఖ ఉక్కు అమ్మకానికి సిద్ధం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ అధానిప్రదేశ్‌గా మార్చుతున్నారు. కౌలు రైతులను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈ రెండు సంవత్సరాల్లో అయిన జగన్‌ ప్రభుత్వంలో మార్పు రాకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు. కమ్యూనిస్ట్‌ల కాలం చెల్లింది అనే వారి కాలం చెల్లుతుంది. దేశంలో కేరళ మాత్రమే రైతులకు న్యాయం చేస్తుంది. వికేంద్రీకరణ అనేది కేరళ వెళ్ళి నేర్చుకోండి'' అని శ్రీనివాసరావు అన్నారు.


https://prajasakti.com/BJP-at-the-center-Implementation-of-Jagan-in-the-state-CPM-state-secretary-Srinivasa-Rao


No comments:

Post a Comment