Sunday, August 14, 2022

భారత రాజ్యాంగ విలువలు - కమ్యూనిస్టుల పాత్ర

 భారత రాజ్యాంగ విలువలు - కమ్యూనిస్టుల పాత్ర

        స్వాతంత్య్రానంతరం మన దేశ పాలనకు దిక్సూచిగా రూపొందించబడిన భారత రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడుతోంది. ఆనాడు డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, అనేక చర్చలు, మేధోమధనం జరిపి రాజ్యాంగాన్ని రూపొందించింది.

     ప్రస్తుత బీజేపీ పాలనలో మన రాజ్యాంగానికి తీవ్ర ప్రమాదమేర్పడింది. వాస్తవానికి రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే వివిధ పార్టీలు అభిప్రాయాలు చెప్పే సందర్భంలో ఆనాటి జనసంఘ్ ఆర్‌ఎస్‌ఎస్‌లు ''కొత్తగా రాజ్యాంగ రచన అవసరం లేదనీ, మనుధర్మ శాస్త్రాన్నే మన రాజ్యాంగంగా ప్రకటించాలని'' చెప్పిన విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి.

     ఆనాటి నుండి కూడా ఆ పార్టీ రాజ్యాంగంలో ఉన్న మౌలిక విలువలను, దాని లౌకిక స్వభావాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్ల కాలంలో ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగంపై దాడి తీవ్రమైంది.

     రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంట్‌లో నిర్ణయాలు జరుగుతున్నాయి. వాటిని సవాల్‌ చేస్తే కోర్టులు విచారించే పరిస్థితి లేదు. రాజ్యాంగ స్వతంత్ర సంస్థలైన రిజర్వ్‌ బ్యాంక్‌, కాగ్‌, ఈడీ, సీబీఐ తదితర సంస్థలన్నీ రాజకీయ వత్తిడిలకు లోనై పాలకులకు జీ హుజూర్‌ అనే పరిస్థితులు దాపురించాయి. మన రాజ్యాంగం బూర్జువా- భూస్వామ్య పాలనకు అనువైన రాజ్యాంగమే. అందులో సందేహంలేదు.

      రాజ్యాంగ లక్ష్యంగా ఉన్న సోషలిస్టు సమాజాన్ని ఆవిష్కరించాలంటే ఈ రాజ్యాంగం స్థానంలో మరింత పురోగామి భావాలతో నూతన రాజ్యాంగాన్ని అభివృద్ది పర్చుకోవల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న రాజ్యాంగమే ప్రమాదంలో పడుతున్న సందర్భం ఇది.

      ప్రస్తుతం అమలులో ఉన్న కనీస బూర్జువా ప్రజాస్వామ్య విలువలు కూడా నాశనమైతే మన ప్రజలు మరింత దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రస్తుత రాజ్యాంగాన్ని దాని మౌలిక విలువలను కాపాడుకోవాల్సిన దేశభక్తియుత కర్తవ్యం మనందరిపైన ఉంది.

     రాజ్యాంగ మౌలిక విలువలు మన దేశ ఆధునికతకు పునాదిగా మన రాజ్యాంగం ఉంది.అనేక అభ్యుదయ,పురోగామి లక్ష్యాలు, విధులు, బాధ్యతలు అందులో చెప్ప బడ్డాయి. మొత్తం రాజ్యాంగ ముఖ్యమైన సారాంశంగా నాలుగు అంశాలు మనం చెప్పవచ్చు.

1.లౌకిక ప్రజాసామ్యం

2.ఆర్ధిక సార్వభౌమత్వం 

3.సామాజిక న్యాయం 

4.ఫెడరల్‌ వ్యవస్థ (రాష్ట్రాల హక్కులు).ఈ నాలుగింటిపైనా నేడు బీజేపీ ప్రమాదకర దాడి సాగుతోంది.

1.లౌకిక ప్రజాస్వామ్యం : లౌకికత్వం అంటే అన్ని మతాలను సమానంగా చూడటం అని కాదు. మతాలను, మత సంప్రదాయాలను అనుసరించటానికి వ్యక్తులకు స్వేచ్ఛ యిస్తూనే రాజకీయాలు, ప్రభుత్వ పాలన, విద్యా బోధన ఈ మూడు అంశాలను మతాలకతీతంగా నిర్వహించటం నిజమైన లౌకిక విధానం. ఎందుకంటే మన 140 కోట్ల మంది ప్రజల్లో అనేక మతాలు ఉన్నాయి. ప్రజలందరికీ సంభందించిన ప్రభుత్వ పాలనగానీ, రాజకీయ పార్టీ విధానాలు గానీ, విద్యా విధానం గానీ ఒక మతానికి ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తే మిగతా ప్రజలు ఈ దేశాన్ని తమదిగా భావించలేరు.ఇప్పటికే ప్రజాస్వామ్యంలో కీలకమైన వాక్సభాపత్రికా స్వాతంత్య్రాలు మృగ్యమవుతున్నాయి.

ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో పోస్టులు పెట్టినా రాజద్రోహంగా కేసులు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని ''అసమర్థ ప్రభుత్వం'' అని విమర్శించటం కూడా నేరమని నిర్థారించిన మన కేంద్ర ప్రభుత్వం ఇంకా రాజ్యాంగ విలువైన ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నదని ఎవరైనా భావించగలరా? ఆ విధంగా దేశ ఐక్యత, సమైక్యతలకు ప్రమాదం పెరుగుతోందని, ప్రజాస్వామ్యం ఉరికంభానికి ఎక్కించ బడుతోందని మనం గమనించాలి.

2.ఆర్థిక సార్వభౌమత్వం : మన దేశంలోని ప్రజల అవసరాలన్నింటిలో... ఆహారం, బట్టలు, మందులు, ఇతర అనేక పారిశ్రామిక ఉత్పత్తులు, వస్తు, సేవలలో ఏ విదేశస్తులపైనా ఆధార పడకుండా మనమే స్వయం సమృద్ధి సాధించటం ఆర్థిక సార్వభౌమత్వం. అలాగే ప్రతి వ్యక్తి, కుటుంబమూ ఆ విధంగా ఎదగటం సోషలిస్టు విధానం.

ఈ లక్ష్యాలు సాధించటానికి సాతంత్య్రానంతరం కొంత కృషి జరిగి ఫలితాలు సాధించాము.కానీ 1990 నుండి సరళీకరణ విధానాలతో ఈ క్రమానికి గండి పడింది. జాతి సంపదలన్నీ కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే విధానం పైచేయి సాధించింది.బీజేపీ పాలనలో ఇది మరింత పరాకాష్టకు చేరింది.

ఇప్పుడు ముఖ్యమైన అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రైళ్లు, విమానాలు, గనులు, అడవులు, భూమి, స్టీల్‌ఫ్యాక్టరీలు, భీమా సంస్థలతో సహా కార్పొరేట్ల వశం అవుతున్న తీరు మనం చూస్తున్నాం.అదికూడా తమకిష్టమైన పెట్టుబడుదారుల (క్రోనీలు - అదాని, అంబానీలు) కే మొత్తం జ్యేష్ట వాటాను కట్టబెట్టే వికృత రూపం మన ముందున్నది. ఇక ఇప్పటి వరకూ కాస్త స్వతంత్రంగా బతుకీడుస్తున్న వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల గురించి ఇంకా మనం మర్చిపోలేదు కదా.ఆ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది.

3.సామాజిక న్యాయం : బీజేపీ పాలనలో తీవ్ర అన్యాయాలకు గురైన అంశాలలో ''సామాజిక న్యాయం'' ఒకటి. ఈ కాలంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయి. దళితులు, మైనారిటీలపై దాడులు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి.ఆహార అలవాట్లు, వస్త్రధారణ,యుక్త వయసులోని యువతీ యువకుల హక్కులు నేరాలుగా మారిపోయాయి.

భూమి, వేతనాలు, ఆత్మగౌరవం లాంటివి అంటరాని పదాలుగా మారిపోయాయి. ప్రయివేటు గుండాల దాడులు,ఖాఫ్ పంచాయతీలు,గ్రామీణ భూస్వామ్య రాజ్యాలు యథేచ్చగా వర్థిల్లుతున్నాయి. ఎస్సీ,ఎస్టీ చట్టాలు అమలు లేదు.నిధుల కేటాయింపు నామమాత్రమైంది.

4.ఫెడరల్‌ వ్యవస్థ : రాజ్యాంగంలో దేశ వైశాల్యమూ, వైవిధ్యతను దృష్టిలో ఉంచుకుని, పాలన అనేది కేంద్రంతో పాటు రాష్ట్రాల ప్రాధాన్యతతో ఉండాలని చెప్పబడింది. ఇందుకోసం ఏ అంశాలు కేంద్రం అధీనంలో ఉండాలి, ఏ అంశాలు రాష్ట్రం అధీనంలో ఉండాలి, ఏఏ అంశాలు ఉభయులు సంప్రదించుకోవాల్సినవి అనేది స్పష్టంగా పేర్కొన బడింది.కానీ ఈ 75 సంవత్సరాల కాలంలో రాష్ట్రాల హక్కులు, అధికారాలన్నీ క్రమేణా కుదించ బడుతుండగా, నేటి బీజేపీ పాలనలో రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చారు. ఉదా|| ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలు ఉమ్మడి జాబితాలోనివి.

రాష్ట్రాలను సంప్రదించ కుండా అలాంటి చట్టాలను తీసుకు రాకూడదనేది రాజ్యాంగ స్పూర్తి. కానీ బీజేపీ అదేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా, పార్లమెంటులో కూడా చర్చే లేకుండా చట్టాలు చేసింది. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లుగానీ, జీఎస్‌టీగానీ ఇంకా అనేక విషయాల్లో ఇలాగే ఏకపక్షంగా వ్యవహరిస్తోంది.

రాజ్యాంగంలోని ఈ ముఖ్యమైన నాలుగు విలువలూ అప్పటికపుడు,చర్చలలో ముందుకొచ్చినవో లేక కొందరు మేధావులు ఆలోచించి రూపొందించినవో అనుకుంటే పొరపాటు.భారత దేశ పరిణామ క్రమంలో సుదీర్ఘ కాలంలో ప్రజలను ఆవరించిన భావజాలం అది. దాని రూపకల్పనలో అనేక ఘటనలు,పోరాటాలు,రాజకీయ శక్తులు పాత్ర వహించాయి.ఈ సందర్బంగా రాజ్యాంగంలోని ఈ నాలుగు ముఖ్యమైన విలువల రూపకల్పనలో ఆనాటి కమ్యూనిస్టుల పాత్రను క్లుప్తంగా గుర్తు జేసుకోవటం అవసరం.

సంపూర్ణ స్వాత్రంత్యం: మన దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని మొదట డిమాండ్‌ చేసింది కమ్యూనిస్టులే.స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్‌ పార్టీ చాలా కాలం వరకు భారతీయులకు ముఖ్యంగా పెట్టుబడిదారులకు కొన్ని హక్కులు,అవకాశాలు కల్పించాలని కోరారు తప్ప బ్రిటిష్‌ పాలనను వ్యతిరేకించలేదు. 

1920 లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ 21లో జరిగిన గయ కాంగ్రెస్‌లో సంపూర్ణ స్వరాజ్యం కావాలనే తీర్మానం ప్రవేశ పెట్టింది.కానీ కాంగ్రెస్‌ దానిని తిరస్కరించింది. ఆ తరువాత వరుసగా జరిగిన కాంగ్రెస్‌ మహాసభలలో కమ్యూనిస్టులు ఈ అంశంపై పోరాడుతూనే వచ్చారు.చివరకు 1937లో జరిగిన లాహోర్‌ కాంగ్రెస్‌ సభలో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేయక తప్పలేదు.

లౌకిక ప్రజాస్వామ్యం : 1919లో జరిగిన జలియన్‌ వాలాబాగ్‌ ఊచకోత తరువాత బ్రిటిష్‌ పాలకులు విభజించి పాలించాలనే కుతంత్రాన్ని పాటిస్తూ దేశంలో పెద్దయెత్తున మత కలహాలను రెచ్చగొట్టారు.ఆ తరువాత దేశం భారత్‌, పాకిస్థాన్‌లుగా విడిపోవటానికి కూడా బ్రిటిష్‌వారి ఈ కుట్రలే కారణం.

సువిశాల భారత దేశంలో అనేక మతాలు కలిసి ఉండాల్సిన నేపథ్యంలో లౌకిక విధానమే ప్రభుత్వ విధానంగా ఉండాలని కమ్యూనిస్టులు ఆనాటి నుండీ పోరాడుతూ వచ్చారు.ఆ విధంగా లౌకిక ప్రజాస్వామ్యం అనేది ఒక ముఖ్యమైన విలువగా రాజ్యాంగంలో చేరింది.

ఆర్థిక సార్వభౌమత్వం: వెనకబడిన భారత ఆర్ధిక వ్యవస్థను స్వయం సమృద్ధిగా అభివృద్ధి పర్చాలంటే పెట్టుబడిదారీ ఆధిపత్యం కాకుండా ప్రభుత్వ రంగం పాత్ర ప్రధానంగా ఉండాలనే వాదనను ఆనాడు కమ్యూనిస్టులు ముందుకు తెచ్చారు. వాస్తవానికి భారత పెట్టుబడిదారులు కూడా వారి ప్రయోజనాల కోసం ఈ విధానాన్నే సమర్థించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో భారీ పరిశ్రమలు నెలకొల్పటానికి, రైల్వేలు, విద్యుత్తు, స్టీల్‌ వగైరా రంగాలలో పెట్టుబడులు పెట్టేంత ఆర్థిక శక్తి ఆనాటి పెట్టుబడిదారులకు లేకపోయింది.అందువల్ల ప్రభుత్వం రంగాన్ని అభివృద్ధి పర్చాలని వారూ కోరుకున్నారు.ఆ తరువాత కాలంలో తమ చేతుల్లో భారీగా పెట్టుబడి పోగు బడ్డాక ఆ ప్రభుత్వ రంగాన్ని కాజేయటానికి తెగబడ్డారు.

సామాజిక న్యాయం: స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించింది పెట్టుబడిదారీ వర్గమే అయినా ఆ పోరాటంలో విశాల ప్రజానీకాన్ని సమీకరించే ఎజండాను ముందుకు తెచ్చింది కమ్యూనిస్టులే. దళితులు, గిరిజనులు, మహిళల సమస్యలపై పెద్దయొత్తున పోరాటాలు కమ్యూనిస్టుల నాయకత్వంలో నడిచాయి.

తెలంగాణలో భూమి,వెట్టి చాకిరీ సమస్యలపై సాగిన సాయుధ రైతాంగ పోరాటం,కేరళలో జరిగిన పున్నప్ర వాయిలార్‌ పోరాటం, బెంగాల్‌లో జరిగిన తెభాగా పోరాటం, మహారాష్ట్రలో జరిగిన వర్లీ ఆదివాసీ పోరాటాలు స్వాతంత్ర పోరాటంలో మహోజ్వల ఘట్టాలు. బొంబాయి కేంద్రంగా కార్మికోద్యమం పెద్ద యొత్తున రంగంలోకి వచ్చింది. సామాన్య ప్రజలందరూ సామాజిక సమస్యలపై ఉవ్వెత్తున కదిలిన ఈ పోరాటాలన్నీ కమ్యూనిస్టుల నాయకత్వంలోనే జరిగాయి.

ఫెడరల్‌ వ్యవస్థ : స్వాతంత్య్రం వచ్చేనాటికి ఇప్పటి రాష్ట్రాలు లేవు.ఆ నాటికి బాంబే, మద్రాస్‌, కలకత్తా వగైరా కేంద్రాలుగా ప్రెసిడెన్సీలు ఉండేవి.అనేక భాషలు మాట్లాడే ప్రజలందరూ వాటిల్లో కలిసే ఉండేవారు.మన తెలంగాణ ఉన్న నిజాం సంస్థానంలో తెలంగాణతో పాటు కర్నాటక,మహారాష్ట్ర ప్రాంతాలు కూడా కలిసి ఉన్నాయి.

స్వాతంత్య్ర పోరాటంలోనే భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండ్‌ను కమ్యూనిస్టులు ముందుకు తెచ్చారు. విశాలాంధ్ర,ఐక్య కేరళ, సంయుక్త మహారాష్ట్ర,బీహార్‌ ఉద్యమాలలో కమ్యూనిస్టులు కీలక పాత్ర వహించారు. కాంగ్రెస్‌ పార్టీ చాలాకాలం దాకా ఈ డిమాండ్‌ను అంగీకరించ లేదు.తరువాత అంగీకరించినా తాను అధికారంలోకి వచ్చాక పాటించలేదు.

కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.రాష్ట్రాల హక్కులు,అధికారాల గురించి రాజ్యాంగంలో ప్రత్యేకంగా ప్రస్తావన చేయబడింది.మనదేశ వైవిధ్యం రీత్యా అన్ని రాష్ట్రాలకు ఒకే అభివృద్ధి నమూనాలు సాధ్య పడవు.ఆయా రాష్ట్రాల ప్రత్యేకతలను బట్టి ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాలి.

అందువల్ల అత్యధిక అంశాలను రాష్ట్రాల పరిధిలోకి చేరుస్తూ రాజ్యాంగం రూపొందింది. కానీ కాలక్రమంలో రాష్ట్రాలను బలహీన పరుస్తూ కేంద్రంలో అధికారాలను కేంద్రీకరింప జేసే ధోరణి బలపడింది.బీజేపీ పాలనలో ఈ ధోరణి విపరీత స్థాయికి చేరింది.

రాజ్యాంగ మౌలిక స్వభావాన్నే తిరగదోడుతున్న బీజేపీ ప్రయత్నాలను అడ్డుకోవటం,లౌకిక ప్రజాస్వామ్యం,ఆర్థిక సార్వభౌమత్వం,సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు లాంటి ముఖ్యమైన రాజ్యాంగ విలువలను కాపాడుకోవటం నేటి మన కర్తవ్యం..... 

- తమ్మినేని వీరభద్రం

No comments:

Post a Comment