Thursday, June 20, 2019

బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం

బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం

రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలన్న వ్యూహంతో ఉన్న బీజేపీ.. టీడీపీ ఎంపీలను చేర్చుకోడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం ఎన్డీఏకు 102 మంది సభ్యులున్నారు. వీరిలో బీజేపీ సభ్యులు 71 మంది మాత్రమే. బీజేపీ రాజ్యసభ సభ్యులు ఇటీవల ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానాలకు త్వరలో నిర్వహించే ఎన్నికలతో రాజ్యసభలో బీజేపీకి కొత్తగా మరో నలుగురు సభ్యులు చేరనున్నారు. దీంతో బీజేపీ బలం 75కు, ఎన్‌డీయే బలం 106కు పెరుగుతుంది. కానీ కీలక బిల్లుల ఆమోదానికి ఈ మెజార్టీ సరిపోదు. ‘ఒక దేశం... ఒకే ఎన్నికలు’ ‘ట్రిపుల్‌ తలాక్‌ రద్దు’ తదితర బిల్లులను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆమోదం పొందేలా చూడాలన్నది బీజేపీ వ్యూహం.

పార్టీ మూల సిద్ధాంతాలకు సంబంధించిన 370 ఆర్టికల్‌ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి తదితర బిల్లులను కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నది బీజేపీ యోచన. ఈ నేపథ్యంలో కీలక బిల్లులు ఆమోదం పొందేలా చూసేందుకు 2020 నాటికి రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలని బీజేపీ నిర్ణయించింది. అందుకోసం అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు తమతో టచ్‌లోకి రావడంతో వారితో చర్చించే బాధ్యతను రాం మాధవ్, కిషన్‌రెడ్డిలకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరితో టీడీపీ ఎంపీల చర్చలు దాదాపు సానుకూలంగా ముగిసినట్లు సమాచారం. దీనిపై బీజేపీ కీలక నేత ఒకరిని ‘సాక్షి’ సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగంతో పార్లమెంట్‌ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఈ సమావేశాల్లోనే రాజ్యసభలో తమ బలం పెంచుకునేలా వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తుండగా, టీడీపీని వీడేందుకు ఆ పార్టీ ఎంపీలు సమాయత్తం కావడం రాజకీయాలను రక్తి కట్టిస్తోంది

No comments:

Post a Comment