Kothapaluku: మోదీ తప్పుటడుగు...!
ABN , First Publish Date - 2023-10-08T01:03:59+05:30 IST
Kothapaluku: మోదీ తప్పుటడుగు...!
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట! మూడు రోజుల క్రితం నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం విన్న వారికి ఈ సామెత గుర్తుకు రావడం సహజం. తన వాక్చాతుర్యం, హావభావాలు, ఎత్తుగడలతో దేశ రాజకీయాల్లో తనకు సమ ఉజ్జీ లేరన్న అభిప్రాయాన్ని ఇన్నాళ్లుగా ప్రధాని మోదీ దేశ ప్రజలలో కలిగించారు. మోదీ భక్తులు నమో నామస్మరణలో తరించేవారు. అలాంటి మోదీ నిజామాబాద్ సభలో మాత్రం పప్పులో కాలేశారు. నోరు జారారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో తనను కలిసి అత్యంత వినయంగా శాలువా కప్పి మరీ బీఆర్‌ఎస్‌ను ఎన్డీయేలో చేర్చుకోవలసినదిగా అభ్యర్థించారని చెప్పారు. తన కుమారుడైన కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నానని, అందుకు మీ ఆశీస్సులు కావాలని కోరారని కూడా చెప్పుకొచ్చారు. ‘‘మీరేమైనా రాజులా? వారసులకు సింహాసనాన్ని అప్పగించడానికి’’ అని ఆ సందర్భంగా కేసీఆర్‌ను హెచ్చరించానని కూడా మోదీ చెప్పారు. ‘‘మీకు ఓ రహస్యం చెప్పనా...’’ అంటూ మొదలుపెట్టి ఆయన ఈ విషయాలు చెప్పారు.
ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఒక ఆంతరంగిక సంభాషణను ఇలా వెల్లడించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతర్గత సంభాషణలను బహిర్గతం చేయడం వల్ల ప్రధానమంత్రి తన స్థాయి తగ్గించుకున్నారని చెప్పవచ్చు. రహస్యాన్ని బహిర్గతం చేయడం వల్ల ఆయనకు గానీ, భారతీయ జనతా పార్టీకి గానీ లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్న అభిప్రాయం ఏర్పడింది. ప్రధానమంత్రి పదవిలో ఉన్న వారిని అధికారపక్షంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా కలసి అనేక రాజకీయ అంశాలను పంచుకోవడం సహజం. తనను కలసిన ముఖ్యమంత్రులు మనసులోని మాటలను చెప్పుకొంటారు. కష్టసుఖాలు పంచుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నరేంద్ర మోదీని కలిసి తన మనసులోని మాటను చెప్పుకునే ఉంటారు. అయితే ప్రధానమంత్రి నోటి నుంచి నాటి అంతర్గత సంభాషణ బహిర్గతం కావడం మాత్రం విస్మయానికి గురిచేస్తోంది. ప్రధానమంత్రి స్థాయికి ఇది తగదని బీజేపీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. ఇంతకీ నరేంద్ర మోదీ ఏమి ఆశించి నాటి రహస్యాన్ని చెప్పారోగానీ, ఇలా చేయడం రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా ఆయనకు నష్టమే కలిగించింది.
భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య ఏదో రహస్య అవగాహన ఏర్పడిందన్న అభిప్రాయం తెలంగాణలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న తరుణంలో ప్రధాని ఇలా మాట్లాడటంతో సదరు ప్రచారానికి ఊతం ఇచ్చినట్టయింది. ఈ పరిణామం అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చుతుంది కూడా! ఎన్డీయేలో తమను చేర్చుకోవాలని కేసీఆర్ నిజంగా అభ్యర్థించి ఉంటే ఆ విషయాన్ని ప్రధానమంత్రి స్వయంగా చెప్పకుండా బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరైనా చెప్పి ఉంటే అది వేరుగా ఉండేది. అలా కాకుండా ప్రధానమంత్రే స్వయంగా ప్రకటించడం అనైతికం. తన మాటల చాతుర్యంతో ప్రతిపక్షాలకు మాటల్లేకుండా చేస్తూ వచ్చిన నరేంద్ర మోదీ ఇప్పుడు మొదటిసారిగా తప్పులో కాలేశారు.
ప్రధానమంత్రి నోటి నుంచి ఈ రహస్యం వెలువడిన వెంటనే బీఆర్‌ఎస్ ప్రతిస్పందించింది. ‘నేను ముఖ్యమంత్రి కావడానికి మోదీ ఆశీస్సులు ఎందుకు? ప్రజల ఆశీర్వాదం కావాలిగానీ!’ అని మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ఆయన అంతటితో ఆగకుండా ఎన్డీయేలో చేరడానికి తామేమీ ఆరాటపడలేదని, నిజానికి 2018 ఎన్నికల సమయంలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తమను కలసి పొత్తు పెట్టుకుందామన్న ప్రతిపాదన తెచ్చారని కేటీఆర్ మరో గుట్టు విప్పారు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటు మంత్రి కేటీఆర్ పరస్పరం రహస్యాల గుట్టు విప్పడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది. ఈ ఇరువురి ప్రకటనల వల్ల పొత్తులకోసం అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్ కూడా ఉత్సుకత ప్రదర్శించినట్టు స్పష్టమవుతోంది. మరో నలభై రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఇద్దరు నాయకులు చెప్పిన రహస్యాల వల్ల ఆ పార్టీలకు నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. బీజేపీకి బీఆర్‌ఎస్ ‘బీ’ టీమ్ అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. ఇప్పుడు గుట్టు రట్టు కావడంతో కాంగ్రెస్ ప్రచారానికి ఊతమిచ్చినట్టు అయింది.
నాడు ఇందిర.. నేడు మోదీ...
ప్రధాని మోదీ నోరు జారడం ఇప్పటిదాకా జరగలేదు. టైం బాగోలేనప్పుడు ఇలా జరుగుతుందేమో తెలియదు. నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. సొంత పార్టీ వారికి కూడా ఆయన మాటలు రుచించలేదు. నవంబరులో జరిగే ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పిస్తే కేసీఆర్ మింగిన అవినీతి సొమ్మును కక్కిస్తానని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. మోదీ ఈ దేశ ప్రధాని. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరడం ఏమిటో అర్థం కావడంలేదు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని లేదా తెలంగాణకు చెందిన, తమ పార్టీకి చెందిన ఫలానా నాయకుడిపైన నమ్మకం ఉంచి అవకాశమివ్వాలని ఆయన కోరకపోవడం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. బీజేపీ స్థానంలో ‘నేను–నాకు’ అన్న మాటలే నరేంద్ర మోదీ నోటి వెంట వెలువడ్డాయి. ఒకప్పుడు ఇందిరాగాంధీ కూడా ఇలాగే వ్యవహరించేవారు. కాంగ్రెస్ పార్టీనే తనపై ఆధారపడేలా ఆమె పరిస్థితులను మార్చుకున్నారు. ఫలితంగా కాలక్రమంలో పార్టీ బలహీనపడి, రాష్ర్టాలలో ఆ పార్టీకి బలమైన నాయకులు లేకుండా పోయారు. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకోవడం చూశాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా నరేంద్ర మోదీ అదే సంస్కృతిని తీసుకురావాలనుకుంటున్నారా? అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలి.
ప్రస్తుతానికి బీజేపీలో సమష్ఠి నాయకత్వం లేకుండా పోయింది. నిన్న మొన్నటి వరకు బీజేపీపై రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్‌కు అదుపు ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తమ అభిప్రాయాలను పట్టించుకోని పరిస్థితి ఉన్నప్పటికీ తాము కోరుకున్న బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా అని సంఘ్ నాయకులు సర్ది చెప్పుకొంటున్నారు. ఇక బీజేపీలో నరేంద్ర మోదీ కళ్లలో కళ్లు పెట్టి చూసి మాట్లాడగల నాయకులే లేకుండా పోయారు. కేంద్ర మంత్రులు డమ్మీలుగా మారిపోయారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఒకప్పుడు ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా అన్న నినాదాన్ని కాంగ్రెస్ పార్టీలోని ఆమె భక్తులు డీకే బారువా వంటి వారు అందిపుచ్చుకున్నారు.
ఇప్పుడు బీజేపీ అంటే మోదీ – మోదీ అంటే బీజేపీ అని చెప్పుకొనే పరిస్థితి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే ‘భారత్ అంటే మోదీ – మోదీ అంటే భారత్’ అనే నినాదం వినిపిస్తుందేమో తెలియదు. వ్యక్తిపూజ పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయి. ఇందిరాగాంధీ భజన పెరిగినప్పుడే ఈ దేశంలో అత్యవసర పరిస్థితి వచ్చింది. ఎమర్జెన్సీ చేదు అనుభవాలను ప్రజలు ఇంకా మరచిపోలేదు. బీజేపీలో నరేంద్ర మోదీ వటవృక్షంలా పెరిగిపోవడం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమే. వ్యక్తి ఆరాధనకు తావు ఇవ్వనంత వరకు ఎవరు ఎంత ఎత్తు ఎదిగినా ఫర్వాలేదు. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి పూజ లేదు. నెహ్రూ సమ ఉజ్జీలైన నాయకులు ఎందరో ఆ పార్టీలో ఉండేవారు. ఇందిరా గాంధీ హయాం వచ్చే సరికి కాంగ్రెస్ పార్టీలో నాయకులు బలహీనపడ్డారు. మొత్తం పార్టీనే ఆమెపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఫలితంగా ఇందిరా గాంధీలో నియంతృత్వ పోకడలు పొడచూపాయి.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడకూడదని కోరుకోవడంలో తప్పు లేదు. నరేంద్ర మోదీలో నియంతృత్వ పోకడలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం ఇప్పటికే ఉంది. పార్టీపరంగా తీసుకొనే నిర్ణయాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా మోదీ తీసుకొనే నిర్ణయాల గురించి బీజేపీలో ఇంకెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీలో నంబర్ 2గా చలామణి అవుతున్నప్పటికీ ఆయన కూడా స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ప్రధాని మోదీ ఆదేశాలను అమలు చేయడం వరకే అమిత్ షా పాత్ర పరిమితం అని అంటారు. ఇటీవలి కాలంలో మోదీ–షాల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని అంటున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలలో స్థానిక నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. కేంద్ర నాయకత్వం ఈ రాష్ర్టాలకు ఇతరులను దిగుమతి చేసింది. దీంతో పార్టీని ఏకతాటిపై నడిపేవారు లేకుండా పోయారు. నిర్ణయాలకోసం ఢిల్లీ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందట! దిగుమతి కాబడ్డ నాయకులు కూడా మోదీ వర్గం, షా వర్గంగా విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ‘నాకు అవకాశం ఇవ్వండి’ అని రాష్ర్టాలలో కూడా సరికొత్త రాగం అందుకున్నారని చెబుతున్నారు.
మొత్తం పార్టీని తన చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రస్తుతానికి చెక్ పెట్టేవారు ఆ పార్టీలో లేరు. అమిత్ షా కూడా మోదీని ఎదిరించి నిలువలేని పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో కుటుంబ వారసత్వం ఉంటుందని, నియంతృత్వ పోకడలు పెరిగి పోతున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. ఈ విమర్శలలో నిజం ఉంది కూడా. అయితే అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా మోదీ నేతృత్వంలో జాతీయ స్థాయి ప్రాంతీయ పార్టీగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. సమష్ఠి నాయకత్వం స్థానంలో అంతా మోదీనే అన్న భావన ఏర్పడింది. అందుకే ప్రధాని మోదీ నోటి వెంట నేను–నాకు, ఒక అవకాశం ఇవ్వండి వంటి పదాలు వెలువడుతూ ఉండవచ్చు. తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వాన్ని ఎందుకు మార్చారో రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలు ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఉత్తరాది మోడల్‌నే ఇక్కడా అమలు చేయాలని అనుకోవడం వల్లనే తెలంగాణలో బీజేపీకి ప్రస్తుత పరిస్థితి ఏర్పడింది. సరైన కారణం లేకుండా మునుగోడులో ఉప ఎన్నిక తీసుకురావడం, ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ బలహీనపడటం మొదలైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాల కారణంగా మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశం ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ విప్పిన పొత్తుల గుట్టుతో బీజేపీతో పాటు బీఆర్‌ఎస్ కూడా ఆత్మరక్షణలో పడిపోయింది. దీనికి తోడు బీజేపీకి 30 సీట్లు వచ్చినా తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీఎల్ సంతోష్ శుక్రవారం నాడు ప్రకటించారు. అంటే బీఆర్‌ఎస్‌తో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు స్కెచ్ వేస్తున్నారన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కేంద్ర నాయకుల ఎత్తుగడలు కర్ణాటకలో వికటించాయి. స్థానిక నాయకత్వం ప్రమేయం లేకుండా గతంలో కాంగ్రెస్ వ్యవహరించినట్టుగానే ఇప్పుడు బీజేపీ కూడా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా దక్షిణాదిన బీజేపీ బలపడకపోగా బలహీనపడుతోంది.
మోదీని చూసి రాష్ట్ర ప్రభుత్వాలను ఇక్కడ ఎన్నుకోవాలంటే స్థానిక నాయకుల ముఖాలకు ఇక విలువేం ఉంటుంది? కర్ణాటకలో యడ్యూరప్పను పక్కన పెట్టాకే అక్కడ బీజేపీ బలహీనపడింది. తెలంగాణలో ఏమి జరుగుతున్నదో చూస్తున్నారు. బీఎల్ సంతోష్‌ను చూసి లేదా ఆయన చెప్పే మాటలను నమ్మి ఇక్కడ ప్రజలు ఓటు వేయరు. తెలంగాణ సమాజం కేసీఆర్ అనుకూల, వ్యతిరేక శిబిరాలుగా విడిపోయింది. ఈ పరిస్థితులలో కేసీఆర్ వ్యతిరేక శిబిరంలో నమ్మకం కలిగించగలిగే పార్టీకి మాత్రమే ఆదరణ ఉంటుంది. పొత్తుల కోసం బీజేపీ– బీఆర్‌ఎస్ తెరవెనుక ప్రయత్నాలు చేశాయనే గుట్టు రట్టు చేసుకోవడం వల్ల ఉభయ పక్షాలకూ నష్టమే జరుగుతుంది తప్ప లాభం కలగదు. నరేంద్ర మోదీలాంటి అపర చాణక్యుడికి ఈ మాత్రం లాజిక్ తెలియదా?
వింత... విషాదం!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వద్దాం! మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును స్కిల్ కేసులో జైలుకు పంపి నెల అవుతోంది. న్యాయం ఆయనతో దోబూచులాడుతోంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని అంటారు. చంద్రబాబుకు న్యాయం దొరకడంలో జాప్యం జరగడం ప్రజల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వంద మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు గానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని మన న్యాయశాస్త్రమే చెబుతున్నది.
స్కిల్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు చాలాకాలంగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఈ వ్యవహారంలో చంద్రబాబుకు కమీషన్లు ముట్టాయని ఆధారాలు సేకరించలేకపోయారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కనీస ఆధారాలు లభించకపోయినా చంద్రబాబు నెల రోజులుగా జైలుకే పరిమితం కావడం న్యాయ వ్యవస్థలోని డొల్ల తనాన్ని బయట పెడుతోంది. ఈ కేసులో వాదనలు సుదీర్ఘంగా కొనసాగడమే కాకుండా తీర్పులు కూడా రిజర్వు అవుతున్నాయి.
చంద్రబాబు మాత్రం జైలు జీవితం గడుపుతున్నారు. డబ్బు చేతులు మారినట్టు కనీస ఆధారాలు కూడా లేని ఒక కేసులో చంద్రబాబు స్థాయి నాయకుడిని నెల రోజులుగా రిమాండ్‌లో ఉంచడం వింతగా ఉంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు కాబడిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం. ‘సిసోడియాపై మోపిన ఆరోపణలను న్యాయ సమీక్షలో రెండే రెండు నిమిషాల్లో కొట్టివేస్తారు. ఆయన పాత్రకు సంబంధించి ఆధారాలే లేవు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయినా మనీశ్ సిసోడియా ఎనిమిది నెలలుగా జైల్లో నిర్బంధించబడ్డారు.
ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఆయనకు కమీషన్లు ముట్టినట్టు ఆధారాలు ఉన్నాయా? లేవా? అంటే లేవనే చెప్పాలి. వరుసగా ఒకరి నుంచి ఒకరికి అక్రమంగా లావాదేవీలు జరిగినట్టు సూచించే మనీ ట్రేల్ (Money Trail) జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో నిరూపించలేదు. సీఐడీ దర్యాప్తులో కూడా మనీ ట్రేల్ జరిగిందని నిరూపించలేకపోయారు. చివరికి తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వచ్చిన 27 కోట్ల రూపాయల సభ్యత్వ రుసుము మొత్తాన్ని స్కిల్ కేసులో ముడుపులతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి కేసులలో మనీ ట్రేల్‌కు సంబంధించి కనీస ఆధారాలు ఉన్నాయా లేవా అని చూడకుండా మెకానికల్‌గా రిమాండ్ విధించడం ప్రస్తుత న్యాయ వ్యవస్థలో కనిపిస్తున్న లోపం.
లిక్కర్ కుంభకోణంలో సిసోడియా పాత్రపై ఆధారాలు లేకపోయినా ఎనిమిది నెలలుగా రిమాండ్‌లో ఉంచడం సమర్థనీయమా? చంద్రబాబు విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. కోడి కత్తి కేసులో పెద్ద డ్రామా చోటుచేసుకుందని వెల్లడయ్యాక కూడా నిందితుడు శ్రీనివాసరావును ఐదేళ్లుగా జైల్లోనే నిర్బంధించి ఉంచడం న్యాయ వ్యవస్థకు శోభనివ్వదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో మనీ ట్రేల్ జరిగినట్టు సీబీఐ ప్రాథమిక ఆధారాలు సేకరించగలిగింది. సదరు ఆధారాలు న్యాయ సమీక్షలో నిలుస్తాయా? లేదా? అన్నది వేరే విషయం. కనీస ఆధారాలనైతే సేకరించారు కదా! చంద్రబాబు విషయంలో మనీ ట్రేల్ జరిగినట్టు దర్యాప్తు సంస్థ ఇంతవరకు న్యాయస్థానానికి ఆధారాలు సమర్పించలేదు. అదేమంటే దర్యాప్తు కీలక దశలో ఉందని అంటారు. దర్యాప్తులో ఆధారాలు సేకరించకపోయినా చంద్రబాబును రిమాండ్‌కు పంపడం ఏమిటో అర్థం కాదు. కనీసం రెండు నెలలైనా చంద్రబాబును జైలుకే పరిమితం చేయాలన్నది పాలకుల కోరికట! పాలకుల కోరిక ఫలిస్తుందో లేదో తెలియదుగానీ నిర్దోషి అయినప్పటికీ, చంద్రబాబు అన్యాయంగా జైలు జీవితం గడుపుతున్నారు. ఈ దుస్థితికి పరిష్కారాన్ని న్యాయ వ్యవస్థ మాత్రమే అన్వేషించాలి. అప్పటివరకు నిర్దోషులు జైళ్లలో, దోషులు బయట ఉంటారు. ఇదొక విషాద పరిణామం!
ఏపీ పరిస్థితికి అద్దం...
ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల విషయానికి వద్దాం! తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలను ‘ఆంధ్రప్రదేశ్‌కు కూడా వెళ్లి పెట్టుబడులు పెట్టండి. జగనన్నకు చెప్పి భూమి ఇప్పిస్తాను’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందరూ బాగుండాలి కదా అని కూడా ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు సీరియస్‌గా చేశారా? లేక వ్యంగ్యంగా అన్నారో తెలియదు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ దుస్థితికి అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని పొరుగు రాష్ర్టాల వారు కూడా చెబుతున్నారుగానీ ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి గారికి అవేవీ పట్టవు. ప్రత్యర్థులను జైలుకు పంపడం ఎలా? అన్న దానిపైనే ఆయన బిజీగా ఉన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు చూశాకైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్లు తెరుస్తారా?
ఆర్కే