Friday, January 22, 2021

FARM LAWS - 11th Round Talks Failed

 చర్చల కథ సమాప్తం!


Jan 23 2021 @ 01:26AMహోంజాతీయం



చట్టాల వాయిదా ప్రతిపాదనకు రైతులు నో


11వ రౌండ్‌ చర్చలూ విఫలం.. మరిక చర్చలుండవని కేంద్రం సంకేతాలు


ఈ నిరసనకు పవిత్రత లేదు.. తోమర్‌ వ్యాఖ్యలు


రద్దు ప్రసక్తే లేదని స్పష్టీకరణ


సమావేశంలో మమ్మల్ని అవమానించారు


3 గంటల పాటు వెయిట్‌ చేయించారు


రైతు నేతల వెల్లడి.. ఆందోళన ఉధృతికే నిర్ణయం


రిపబ్లిక్‌ డే రోజు ట్రాక్టర్‌ ర్యాలీ ఆగదని ప్రకటన




న్యూఢిల్లీ, జనవరి 22: ఊహించినట్లే 11వ రౌండ్‌ చర్చలూ విఫలమయ్యాయి. సాగు చట్టాల అమలును ఏడాదిన్నరపాటు ఆపుతామని కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. దీంతో  కేంద్రమూ మొండికేసింది. రద్దు డిమాండ్‌ను ఒప్పుకునే ప్రశ్నే లేదని, ఇక ఈ విషయమై చర్చలు జరిపేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఆందోళనను  మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.


 


శుక్రవారం విజ్ఞాన్‌భవన్‌లో ఐదు గంటలపాటు చర్చలు జరిగినట్లు కనిపించినా.. ముఖాముఖి కూర్చుని మాట్లాడిది కనీసం అరగంట కూడా లేదని సమాచారం. ఈ నేపథ్యంలో రైతు నేతలు కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ‘సమావేశానికి పిలిచి మమ్మల్ని అవమానించారు. మూడున్నర గంటలపాటు వేచి చూసేట్లు చేశారు. ఆ తరువాత తోమర్‌ హడావిడిగా వచ్చి చట్టాల సస్పెన్షన్‌ ప్రతిపాదనపై ఏం చేశారని అడిగారు. మా సమాధానం విన్నాక ఇక చర్చించేదేమీ లేదని, ఇక మీదట చర్చలు జరపడం కూడా అనవసరమని మాతో అన్నారు’’ అని రైతు నేత ఎస్‌ఎస్‌ పాంథర్‌ చెప్పారు. కావాలంటే రెండేళ్ల పాటు వాయిదా వేస్తామని ప్రభుత్వం చెప్పినట్లు బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్‌ వెల్లడించారు. చట్టాలను ఏడాదిన్నరపాటు వాయిదా వేయాలని చేసిన ప్రతిపాదన తమకు సమ్మతం కాదని రైతులు మంత్రులకు ముందే చెప్పేశారు. అయితే ఈ విషయంలో రైతులు ఆలోచించుకునేలా తోమర్‌ భోజన విరామం ఇచ్చారు. ఆ సమయంలో రైతులు తమలో తాము చర్చించుకున్నారు. వేరే గదిలో మంత్రులు సమాలోచనలు జరిపారు. చివరకు ప్రతిష్టంభన తొలగలేదు. 




బయటి శక్తులు ప్రవేశించాయి..: తోమర్‌


‘‘సమస్య పరిష్కారానికి మేం ప్రతిపాదించిన చట్టాల వాయిదా ప్రతిపాదనపైనా, ఉభయ పక్షాలతో సంయుక్త కమిటీ ఏర్పాటుపైనా శనివారంలోగా ఏదో ఒక నిర్ణయం చెప్పమని మేం అడిగాం. చట్టాల రద్దు వద్దంటే.. మెరుగైన ప్రతిపాదన చెప్పమన్నాం. కానీ వారు పూర్వవైఖరికే కట్టుబడ్డారు’’ అని తోమర్‌ మీడియాకు చెప్పారు. ‘‘ప్రతిష్ఠంభన తొలగలేదు. పరిష్కారం సాఽధ్యపడలేదు. మేం చాలా ప్రతిపాదనలే చేశాం. కానీ బయటి శక్తులు ప్రవేశించాయి. నిరసన కొనసాగాలని నిర్దేశిస్తున్నాయి. అలాంటి స్వార్ధపర శక్తులున్నప్పడు ఆ నిరసనకు పవిత్రత లేదు, పరిష్కారమూ సాధ్యం కాదు’’ అని ఆయన సూటిగా ఆక్షేపించారు. ‘‘11 రౌండ్ల పాటు చర్చలు జరిపినా సాధ్యం కాలేదంటే ఏం చేస్తాం. రైతుల సంక్షేమం అన్నది చర్చలు జరుపుతున్న వారి హృదయాల్లో లేదు. శనివారం వరకూ ఎదురుచూస్తాం.




పంజాబ్‌ సహా కొద్ది రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులే ఈ ఆందోళన చేస్తున్నారు.. చట్టాల రద్దు సాధ్యం కాదు’’ అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక చర్చల ప్రక్రియ ముగిసిపోయినట్లేనని, ఆందోళన ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. కాగా- ఈనెల 26వ తేదీన రిపబ్లిక్‌ దినోత్సవం రోజున తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ ఇక ఆగదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి వందలాది ట్రాక్టర్లు రాజధానికి చేరుకుంటున్నాయని, ఇక ఈ దశలో ఆపడం సాధ్యం కాదని అవి కరాఖండిగా తేల్చి చెప్పాయి.