Friday, July 5, 2019

శ్రీలంక కన్నా వెనకబడిన భారత్‌

శ్రీలంక కన్నా వెనకబడిన భారత్‌
Jul 05, 2019, 20:59 IST
 India Remains Lower Middle Income Nation - Sakshi
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశానికి బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నదని, దీన్ని ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళతామని మన నాయకులు గొప్పగా చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ఆర్థిక వర్గీకరణలో మాత్రం మన ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. భారత్‌ ఇప్పటికీ దిగువ మధ్య ఆదాయ దేశంగా కొనసాగుతుండడం విచారకరం. మన దిగువనున్న శ్రీలంక మాత్రం దిగువ–మధ్య ఆదాయ దేశాల బృందం నుంచి 2019–2020 ఆర్థిక సంవత్సరానికి ఎగువ–మధ్య ఆదాయ దేశాల బృందంలో చేరింది. 1999వ ఆర్థిక సంవత్సరంలో దిగువ–మధ్య ఆదాయ గ్రూపులో చేరిన ఆదేశం రెండు దశాబ్దాల్లోనే ఈ ఘనత సాధించింది.

భారత దేశం దిగువ ఆదాయ దేశాల బృందం నుంచి 2009లో దిగువ–మధ్య ఆదాయ దేశాల బృందంలోకి అడుగుపెట్టింది. పదేళ్లు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ అదే కేటగిరీ దేశాల జాబితాలో కొనసాగుతున్నట్లు జూలై ఒకటవ తేదీన ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడయింది. ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా జూలై ఒకటవ తేదీనే వివిధ దేశాల ఆదాయ క్యాటగిరీలా జాబితాను విడుదల చేస్తుంది. జాతీయ ఆదాయం తలకు సగటున ఎంత వస్తున్నదో డాలర్లలో ‘అట్లాస్‌ పద్ధతి’ ద్వారా లెక్కించి దేశాలకు కేటగిరీలను నిర్ణయిస్తుంది.

1. దిగువ కేటగిరీ: ఏడాదికి 1,025 డాలర్లు ఒకరికి సగటున వస్తే, అంటే 70,069 రూపాయలు వస్తే ఆ దేశాన్ని దిగువ కేటగిరీ దేశంగా పరిగణిస్తారు.
2. దిగువ–మధ్య కేటగిరీ: 1,026 నుంచి 3,995 రూపాయలు మధ్యన, అంటే 70,137 రూపాయల నుంచి 2, 73,098 రూపాయలు ఆదాయం సగటున ఉంటే దాన్ని దిగువ–మధ్య కేటగిరీగా పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్‌ ఇదే కేటగిరీలో కొనసాగుతోంది.
3. ఎగువ–మధ్య కేటగిరీ: ఈ 3,996 డాలర్ల నుంచి 12,375 డాలర్లు, అంటే 2,73,167 రూపాయల నుంచి 8,45,955 రూపాయల వరకు తలసరి ఆదాయం రావడం.
4. ఇక ఎగువ కేటగిరీ అంటే 12,376 డాలర్లు, 8,46,023 రూపాయలకన్నా ఎక్కువ ఆదాయం తలసరి రావడం.